ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందా?

what-is-the-tdp-position-between-jagan-and-pawan-war

పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. ‘పవనిజం’ అంటే అదో ‘ఇజం’ అన్నట్లు యువత ఉర్రూతలూగుతుంది. పవన్.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంకా తన బలం నిరూపించుకోనేలేదు. అయినా తమ వల్లే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని.. పవర్ స్టార్ కు, ఆయన ఫ్యాన్స్ కు ఓ బలమైన నమ్మకముంది. సరే.. ఎవరి నమ్మకాలు వారివి! ఇక్కడ మ్యాటర్ ఇది కాదు. జగన్.. పవన్ పై విమర్శలు చేయడమే అసలు పాయింట్. అవీ ఈ కామెంట్లు.. పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకున్నవి కావడం.. జనసేనకు అస్సలు మింగుడుపడటం లేదు..!

ఆ మాటకొస్తే, వైసీపీ వారికీ ఈ కామెంట్స్ షాక్ ఇచ్చాయనే చెప్పాలి. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. కాకినాడ సభలో చంద్రబాబునాయుడు, లోకేష్ లపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడటం టీడీపీకి ఎంత షాక్
ఇచ్చిందో, వైసీపీకీ అంతే స్వీట్ సర్ప్రయిజ్ ఇచ్చింది. అప్పటినుండి వైసీపీ.. పవన్ని తనకు కావలసిన వాడిగా బాహాటంగానే చూస్తూ వచ్చింది. ఎందుకంటే, పవన్ టీడీపీకి దూరమైతే, తాను అధికారానికి
దగ్గరవుతానన్నది వైసీపీ భావన కావచ్చు! కారణం ఏదైనా.. కేంద్రంలో బీజేపీని, ఇక్కడ జనసేనను పల్లెత్తు మాట అనకుండా తన పాదయాత్ర తాను చేసుకుంటున్నారు జగన్. బహిరంగ వేదికలపైనా ఇదే వైఖరి
రిఫ్లెక్ట్ అయ్యేది. వారి స్నేహం గురించి టీడీపీ తీవ్రంగా దుయ్యబడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కథ సాఫీగా సాగితే మజా ఏం ఉంటుంది? అందుకే ఈ సడన్ ట్విస్ట్.

జనసేనాని వ్యక్తిగత జీవితం గురించి.. జగన్ నోటి నుండి వెలువడ్డ మాటలు.. టీడీపీని ఎంతగానో విమర్శిస్తున్న పవన్ ను లక్ష్యంగా చేసుకున్నవి అనేది వాస్తవం. కారణమేదైనా టీడీపీ తన హుందాతనాన్ని
పాటిస్తోందని చెప్పాలి. మరి జగన్ వ్యాఖ్యల వల్ల నష్టమెంత? అంటే.. బాహాటంగా కాకున్నా ఖచ్చితంగా నష్టం కలుగుజేస్తుందని.. వైసీపీ వారు కూడా భావిస్తూ ఉండవచ్చు. టీడీపీకి, జనసేనకు చెడటంతో కాపు
సామాజికవర్గం ఓట్లు కొంతవరకు సాధించుకోవచ్చనుకున్న వైసీపీకి ఇది ఖచ్చితంగా పెద్ద దెబ్బే.

రేణు దేశాయ్ రెండో పెళ్లి విషయంలో పవన్ ఫ్యాన్స్ ఆమెను ఎంతగా ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టారో చూశాం. ఇప్పుడు తనపై వస్తున్న విమర్శలకు జవాబుగా.. తోలు తీస్తా అని పవన్ ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. ఇది ఇక్కడితో ఆగుతుందో లేదో చెప్పలేం. మరెన్ని వికృత రూపాలు దాలుస్తుందో కూడా ఊహించలేం. ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే.. వీరిద్దరి గొడవ మధ్య.. టీడీపీ వాళ్లెవరూ అనవసరంగా తలదూర్చవధ్దని బాబు.. పార్టీ ముఖ్యుల్ని ఆదేశించి తన రాజకీయ చాణక్యతను మరోసారి ప్రదర్శించారు. తనను ఎంతగా పవన్ విమర్శించినా, ఎన్నడూ మాట తూలకుండా జాగ్రత్తపడి , తన పరిణితిని, హుందాతనాన్ని
చంద్రబాబునాయుడు నిలబెట్టుకుంటే.. పాపం జగన్, అయన పార్టీవారు .. ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది.. అని పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు.. రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్నీ ఆత్మహత్యలే అని..!

– సౌజన్య

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -