బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం ఈ స్నేహితులే

relationship-between-lk-adhwani-and-ab-vajpayee

మూడు రోజుల పాటు ఎయిమ్స్‌కొచ్చి వాజ్‌పేయిని చూసిన చాలమందిలో అద్వాని ఒకరు. వాజ్‌పేయి తుది శ్వాస విడవడం అందరికన్నా అద్వానిని ఎక్కువ బాధించి ఉంటుంది. ఎందుకంటే, భారతీయ జనతా పార్టీ చరిత్రలో వీరిద్దరి బంధం వీడదీయ లేనిది. మోడీ శకానికి ముందు బీజేపీ అంటే వాజ్‌పేయి, ఎల్‌.కె.అద్వానీ అనే చెప్పుకోవాలి. పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అంటే అందుకు ఈ ఇద్దరు మిత్రులే కారణం. వీరిద్దరే పార్టీని స్థాపించి ముందుకు తీసుకు వెళ్లారు.

ఒకప్పుడు ఇద్దరూ కలిసి డిల్లీలో ఒకే రిక్షాలో కూర్చుని రావణదహనం జరిగే మైదానానికి వెళ్లేవారు. 1984లో రెండు లోక్ సభ స్థానాలు మాత్రమే వచ్చినప్పుడు.. పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంలో వీరిద్దరిదే ప్రధాన పాత్ర. ప్రధాన మంత్రిగా వాజ్ పేయి బాధ్యతలు చేపడితే.. ఉప ప్రధానిగా అద్వానీ బాధ్యతలు నిర్వహించారు. అందుకే వారిద్దరి అనుబంధం విడదీయలేనిది.

ప్రస్తుతం అద్వాని వయసు 90 ఏళ్లు.. అంటే అటల్‌ జీ కి.. అద్వానీకి వయసులో నాలుగేళ్లే తేడా. ఇద్దరి మధ్య ఏడు దశాబ్దాల రాజకీయ సాన్నిహిత్యం ఉంది. సిద్ధాంత పరంగా బద్ధ వ్యతిరేకులైనప్పటికీ.. ఒకరంటే ఒకరికి అంతులేని గౌరవం. రాజకీయ పంథాలో ఎవరి దారులు వాళ్ళవి.. అయినా పార్టీని ఏకతాటిపై నడిపిన ఘనత వారిది.. దేశ రాజకీయ చరిత్రలో అటల్-అద్వానీ భాగస్వామ్యానికి చాలా ప్రాధాన్యముంది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కి ఇద్దరూ మంచి నమ్మకస్తులు, విశ్వాసపాత్రులు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజపు ముద్రను నిక్షిప్తం చేయడానికి ఇద్దరూ ఎంతో సహకరించారు. జర్నలిజం, సాహిత్యం, సినిమా రంగాలపై ఇద్దరికీ అమితాసక్తి.. 1951లో భారతీయ జన సంఘ్ పేరిట ఏర్పడ్డ పొలిటికల్ పార్టీలో సభ్యత్వం తీసుకుని ఉమ్మడిగా కష్టపడ్డారు. ఎమెర్జెన్సీ సమయంలో ఇద్దరూ జైలుకు వెళ్లిన వాళ్ళే. తర్వాత సీనియర్ పార్లమెంటేరియన్ హోదాలో జన సంఘ్ నేతృత్వ బాధ్యతలు అటల్ జీకి సొంతమయ్యాయి. జన సంఘ్‌ని జనతా పార్టీలో విలీనం చేసి, కాంగ్రెస్‌ని ఓడించడంలో ఇద్దరి పాత్ర చాలా కీలకం. అప్పట్లో వాజ్‌పేయికి విదేశీ మంత్రిత్వ శాఖ దక్కితే.. అద్వానీ ఐఅండ్‌బీ మంత్రిగా భాద్యతలు చేపట్టారు. తరువాత ఇద్దరూ జనతా పార్టీ నుంచి బైటికొచ్చి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల బరిలో దిగినప్పటికీ మొదట ఆశించినంత విజయాలు దక్కలేదు. అయినా అలుపెరుగక పోరాటం చేశారు.

తరువాత పరిణామ క్రమంలో అద్వానీ హిందుత్వంలో అతివాదాన్ని ఎంచుకోవడంతో బీజేపీ పుంజుకోవడం మొదలైంది. కానీ వాజ్‌పేయి మాత్రం మితవాదిగానే మిగిలిపోయారు. బాబ్రీమసీద్, రథయాత్ర లాంటి పాపులర్ స్టెప్స్ తీసుకున్న అద్వానీ బీజేపీలో కొత్త తరాన్ని సృష్టించి ముందుకు నడిపించారు. అధికారంలోకి రావడానికి కష్టపడింది తనే అయినప్పటికీ ప్రధాని కుర్చీని మాత్రం సన్నిహితుడు వాజ్ పేయికి ఇచ్చేశారు. తాను మాత్రం డిప్యూటీ పీఎం హోదాతో సంతృప్తి చెందారు. 2004లో కాంగ్రెస్ రీఎంట్రీతో వాజ్‌పేయి క్రమంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అద్వానీ మాత్రం 2009 దాకా పోరాటం ఆపలేదు. ప్రధాని అభ్యర్థిగా ఎక్స్‌పోజర్ వచ్చినప్పటికీ తన ప్రియమిత్రుడికి దక్కిన అదృష్టం అద్వానీకి దక్కలేదు. దారులు వేరైనా లక్ష్యం ఒకటే అయి పని చేసి భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి చేర్చారు.