హమ్మయ్య.. రూపాయి రికవరైంది..!

rupee-price-increased

గత ఏడు రోజులుగా క్షీణ పథంలో పయనిస్తూ సరికొత్త కనిష్టాలను చవిచూస్తున్న దేశీ కరెన్సీ ఎట్టకేలకు రికవర్‌ అయ్యింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో డాలరుతో మారకంలో రూపాయి 21 పైసలు(0.3 శాతం) బలపడింది. 71.78 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి మరికొంత పుంజుకుంది. ప్రస్తుతం 29 పైసలు(0.4 శాతం) పుంజుకుని 71.70 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఇటీవల నేలచూపులకే పరిమితమైన రూపాయి విలువ గురువారం మరోసారి చరిత్రాత్మక కనిష్టం 71.99 వద్ద ముగిసింది. డాలరుతో మారకంలో ఇంట్రాడేలో 72.11 వద్ద సరికొత్త కనిష్టాన్ని సైతం తాకింది.

21 సెషన్లలో రూ. 2 డౌన్‌
గురువారంనాటి పతనంతో ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి మారకపు విలువ 13 శాతం ఆవిరైంది. గత నెల రోజుల్లో 5 శాతం కోల్పోగా.. గత ఏడు సెషన్లలోనే 3 శాతం క్షీణించింది. కాగా..  70 నుంచి 72కు 21 సెషన్లలో నీరసించింది. ఆగస్ట్‌ 13న తొలిసారిగా 70 మార్క్‌ను తాకిన రూపాయి గురువారానికల్లా 72 స్థాయి దిగువకు జారింది.

విదేశీ కారణాలు
ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడుతుంటే వర్థమాన దేశాల కరెన్సీలు పతనబాటలో సాగుతున్నాయి. మార్చి మొదలు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 8 శాతం ర్యాలీ చేసింది. ఓవైపు అర్జెంటీనా, టర్కీల ఆర్థిక సంక్షోభాలు కొనసాగుతుండగా.. మరోపక్క కరెన్సీ రుపయ్యా పతనాన్ని అడ్డుకునేందుకు ఇండొనేసియా కేంద్ర బ్యాంకు సైతం పలుమార్లు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో డాలరుతో మారకంలో పలు వర్థమాన దేశాల కరెన్సీలు పతనమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రూపాయిపై సైతం ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

దేశీయంగానూ
ఇటీవల తిరిగి జోరందుకున్న ముడిచమురు ధరలు రూపాయి మారకపు విలువపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దేశీ అవసరాలకు 75 శాతం చమురును దిగుమతి చేసుకోవలసి ఉండటంతో దిగుమతుల బిల్లు పెరగనుంది. ఇందుకు సంకేతంగా జులైలో వాణిజ్య లోటు నాలుగేళ్ల గరిష్టానికి చేరిన విషయాన్ని ఆర్థికవేత్తలు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ క్రమంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టనున్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో డాలరు బలపడుతుంటే.. ఆసియా కరెన్సీలు బలహీనపడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -