మరదలి డిమాండ్.. రూ.37 కోట్లు ఇస్తేనే బావని..

మా అక్కయ్యను చేసుకోబోయే వరుడు చాలా మంచి వాడు అంటూ కితాబిస్తోంది నిక్ మరదలు పరిణితీ చోప్రా. పెళ్లిలో మరదలు బావని ఆటపట్టిస్తే తను ఏది కోరితే అదివ్వాలి. కాదనే అవకాశం అస్సలివ్వదు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పెళ్లి నిక్ జొనాస్‌తో వచ్చే నెలలో జరగనుంది. పెళ్లి వేడుకల్లో భాగంగా బావగార్ని ఎలా ఆటపట్టించాలి, అతని దగ్గర్నుంచి ఎంత నొక్కేయాలని ముందుగానే ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంది ముద్దుల మరదలు పరిణితీ చోప్రా. ‘జుతా చురానా’ అని ఉత్తరాది పెళ్లి వేడుకల్లో పెళ్లికొడుకు చెప్పులను మరదళ్లు దొంగిలిస్తారు. వాటిని దాచేసి బావగారి చేత బతిమాలించుకుంటారు. పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తారు.

పెళ్లి నెలరోజుల్లో ఉందనగానే ముందే బావగార్కి లెటర్ పెట్టింది. 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.37 కోట్లు) డిమాండ్ చేసింది పరిణీతి. అంతంటే నావల్ల కాదు 10 డాలర్లే ఇస్తానని నిక్ మరదలకి కబురంపారట. అలా అయితే మీ షూ నాదగ్గరే ఉంటుంది అని రిప్లై ఇచ్చింది మరదలు. దాంతో సరేలే.. మరి కొంచెం పెంచుతానని అన్నారట బావగారు. ఈ విషయానికి సంబంధించి వీరిద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి. నేను ఎంత అడిగినా మా బావగారు ఇచ్చేస్తారు అంటూ కాబోయే బావగార్ని వెనకేసుకు వస్తుంది మరదలు పిల్ల పరిణితీ చోప్రా. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ప్రియాంక, నిక్ పెళ్లి జరగనుందని సమాచారం. మూడు రోజుల పాటు జరిగే ఈ పెళ్లి వేడుకలకు అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాలని అనుకుంటున్నారట.