కేసీఆర్, జగన్‌ కలిసి ఒకే ఫ్లైట్‌లో..

కేసీఆర్, జగన్‌ కలిసి ఒకే ఫ్లైట్‌లో..

కలసి ఉంటే కలదు సుఖం అంటున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. కేసీఆర్, జగన్‌ కలిసి ఒకే ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లబోతున్నారు. రాష్ట్రపతి భవన్‌లో 30న జరిగే మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో తెలుగు సిఎంలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అటు గవర్నర్ నరసింహన్ వీరిద్దరితోపాటే ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌.. అదే రోజు సాయంత్రం జరిగే మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశముంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న జగన్‌ ప్రమాణస్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఒక రోజు ముందు కేసీఆర్‌ విజయవాడ చేరుకుంటారు. గురువారం మధ్యాహ్నమే జగన్ ప్రమాణస్వీకారం పూర్తికానుంది. ఆ వెంటనే ఇద్దరు కలిసి ఒకే ఫ్లైట్‌లో నేరుగా ఢిల్లీ వెళ్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు రెండోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఆ కార్యక్రమంలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవబోతున్నారు తెలుగు ముఖ్యమంత్రులు. జగన్,కేసీఆర్‌తోపాటు రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లనున్నారు.

2014లో సార్క్ దేశాల నాయకులు మోదీ ప్రమాణస్వీకారానికి హాజరు కావడంతో ఈ సారి బిమ్‌స్టెక్ దేశాలను ఆహ్వానించారు. బిమ్‌స్టెక్ సభ్య దేశాలైన బంగ్లాదేశ్,మయన్మార్,శ్రీలంక, థాయ్‌లాండ్,భూటాన్,నేపాల్‌కు సంబంధించిన ప్రభుత్వ అధినేతలకు ఇప్పటికే ఆహ్వానం పంపించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీ చేత ప్రమాణం చేయించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story