ఏకధాటిగా 6గంటలు పబ్‌జీ ఆడి 16 ఏళ్ల యువకుడు గుండెపోటుతో..

ఏకధాటిగా 6గంటలు పబ్‌జీ ఆడి 16 ఏళ్ల యువకుడు గుండెపోటుతో..

ఆన్‌లైన్ గేమ్ పబ్‌ జీ‌కి ఎడిక్ట్ అయి యువత ప్రాణాలు కోల్పోతోంది. చుట్టూ ఎవరున్నారో అన్న విషయం కూడా తెలియకుండా గంటలు గంటలు గేమ్‌లో మునిగిపోతున్నారు. ఈ గేమ్ వల్ల వివాహ బంధాలు కూడా తెగిపోతున్నాయి. అనేక మంది మానసిక స్థితి కోల్పోయి హాస్పిటల్ పాలవుతున్నారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రం ఈ ఆన్‌లైన్ వీడియో గేమ్‌ని బ్యాన్ చేసింది.

తాజాగా మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో మే 28న 16 ఏళ్ల ఫుర్ఖన్ ఖురేషీ ఏకధాటిగా 6 గంటల పాటు పబ్ జీ గేమ్ ఆడి గుండెపోటుతో మరణించాడు. ఇంటర్ చదువుతున్న ఖురేషీ గేమ్ ఆడుతూ ఇతర ప్లేయర్లపై గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అని తండ్రి కొడుకును పోగొట్టుకున్న దుఃఖంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. ఎవడు కనిపెట్టాడయ్యా ఈ గేమ్‌ని ఇంత మంది జీవితాల్ని నాశనం చేస్తోంది అని నెత్తీ నోరు మొత్తుకుంటున్నాడు. నిర్జీవంగా పడి ఉన్న కొడుకుని చూసి తండ్రి కుప్పకూలిపోయాడు.

ఘటన జరిగిన సమయంలో పక్కనే కూర్చుని ఉన్న ఖురేషీ సోదరి ఫిజా మాట్లాడుతూ.. కొంత మంది ప్లేయర్లతో కలిసి అన్న పబ్‌జీ ఆడుతున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా బ్లాస్ట్ చేయి, బ్లాస్ట్ చేయి అని అరిచాడు. మళ్లీ వెంటనే నేను నీతో ఆడను.. నీ వల్లే గేమ్ ఓడిపోయాను అంటూ మొబైల్, ఇయర్ ఫోన్స్ విసిరిగొట్టి ఏడవడం మొదలు పెట్టాడు. అంతలోనే ఉన్నట్టుండి గుండె పట్టుకుని కుప్ప కూలిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే అన్న ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు వివరించారు అని ఫిజా ఏడుస్తూ చెబుతోంది.

యువత తమ విలువైన సమయాన్ని ఇలాంటి చెత్త వాటికి వినియోగిస్తూ టైం వేస్ట్ చేసుకోవడంతో పాటు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని సైకాలజిస్టులు అంటున్నారు. మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి.. వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండండి. స్మార్ట్ ఫోన్లు చేతికి ఇవ్వకండి అని అంటున్నారు. పిల్లలు ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉండేలా చూడమంటున్నారు. గేమ్ ఆడుతూ బాడీకి సరైన ఎక్సర్‌సైజ్ లేక ఊబకాయం బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story