నీరవ్‌ మోదీని ఏ జైలులో ఉంచుతారు.. - మెజిస్ట్రేట్‌

నీరవ్‌ మోదీని ఏ జైలులో ఉంచుతారు.. - మెజిస్ట్రేట్‌

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను నిట్టనిలువునా ముంచిన ఆర్థిక నేరస్తుడు నీరవ్‌ మోదీకి బ్రిటన్‌ కోర్టు జూన్‌ 27 వరకు రిమాండ్‌ పొడిగించింది. అలాగే నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగిస్తే ఏ జైలులో ఉంచుతారు.. ఆయనకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో 14 రోజుల్లోగా వెల్లడించాలని భారత అధికార వర్గాలు తెలియజేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి రిమాండ్‌ విచారణను వచ్చే నెల 27న వీడియోలింక్‌ ద్వారా చేపట్టనున్నట్లు మెజిస్ట్రేట్‌ తెలిపారు.

ఒకవేళ గత ఏడాది డిసెంబరులో కింగ్‌ఫిషర్‌ మాజీ అధినేత విజయ్‌ మాల్యాను ఆర్ధర్‌ జైలులోనే ఉంచుతామని ప్రకటించినట్లుగానే నీరవ్‌ మోదీని కూడా అదే జైలులో ఉంచితే తమకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని మెజిస్ట్రేట్‌ స్పష్టం చేశారు. దీంతో భారత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

పీఎన్‌బీని ఏకంగా 14 వేల కోట్ల వరకు మోసం చేసి లండన్‌కు పారిపోయాడు నీరవ్‌ మోదీ. కొన్ని నెలల క్రితం భారత ప్రభుత్వ అభ్యర్ధన మేరకు బ్రిటన్‌ ప్రభుత్వం నీరవ్‌ మోదీని అరెస్ట్‌ చేసింది. అంతేకాకుండా నీరవ్‌ను విచారణ నిమిత్తం అప్పగించాలని భారత్‌ కోరింది. ఈ కేసు విచారణలో భాగంగానే వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు చీఫ్‌ మెజిస్ట్రేట్‌ ముందు నీరవ్‌ మోదీ హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story