స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌..

ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్‌, నల్గొండ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ సోమవారం జరగనుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. స్థానిక కోటా ఎమ్మెల్సీల స్థానాల ఉప ఎన్నిక కోసం ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు పోటీ పడ్డాయి. మొత్తం 9 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. మే 31న జరిగిన ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల పరిధిలో 2799 మంది ఓటర్లు ఉండగా.. 2722 మంది ఓటుహక్కువినియోగించుకున్నారు.

రంగారెడ్డి జిల్లాకు సంబందించి .. రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 806 ఓట్లకు గాను 797 ఓట్లు పోలయ్యాయి. ఇక వరంగల్‌ జిల్లాకు సంబందించి ఎనుమాముల మార్కెట్‌లో కౌంటింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్ధులున్నారు. ఇక్కడ మొత్తం 902 ఓట్లకు గాను 883 ఓట్లు పోలయ్యాయి. ఇక నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1086 ఓట్లకు గాను 1072 ఓట్లు పోలయ్యాయి.

రంగారెడ్డి జిల్లా స్థానానికి టీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక నల్లగొండ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి బరిలో నిలిచారు. వరంగల్ నుంచి ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పోటీచేస్తుండగా.. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారు. ఈ మూడు జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలలో గెలుపు ఎవరిదో ఇవాళ తేలిపోనుంది.

Tags

Read MoreRead Less
Next Story