ఆ ఎన్నికలు.. వైసీపీ, టీడీపీకి మరో బిగ్ టాస్క్..

ఆ ఎన్నికలు.. వైసీపీ, టీడీపీకి మరో బిగ్ టాస్క్..

సార్వత్రిక ఎన్నికల తర్వాత గ్రేటర్ విశాఖ మరోసారి ఎన్నికల మూడ్ లోకి వెళ్తోంది. గత ఎనిమిదేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న GVMCకి ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. దీంతో ఉక్కు నగరంలో సత్తా చాటేందుకు గ్రౌండ్ వర్క్ ప్రారంభించాయి ప్రధాన పార్టీలు. కొన్నేళ్ల తర్వాత గ్రేటర్ విశాఖలో మళ్లీ ఎన్నికల హీట్ రాజుకుంటుంది. ఏకంగా ఎనిమిదేళ్ల పాటు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే నెట్టుకొచ్చిన కార్పోరేషన్లో ఇక ప్రజల నుంచి ఎన్నుకునే ప్రతినిధులు రాబోతున్నారనే చర్చ ప్రారంభం అయింది. ఆరు నెలల్లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావొచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో విశాఖ కార్పోరేషన్ పై జెండా ఎగరేసేందుకు ప్రధాన పార్టీలు ఎవరికి వారు పక్కా ప్లాన్ తో గ్రౌండ్ వర్క్ ప్రారంభించాయి.

జీవీఎంసీ ఎన్నికలు వైసీపీ, టీడీపీకి బిగ్ టాస్క్ గా మారబోతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మొదటి ఎన్నికలు కావటంతో విజయం సాధించి తీరాల్సిందేనని నేతలు భావిస్తున్నారు. పైగా గ్రేటర్ విశాక పరిధిలో ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచే గెలుపొందారు. దీంతో జీవీఎంసీని గెలుచుకొని ఉక్కునగరంలో తమ సత్తా చాటాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో విజయం టీడీపీకి అత్యవసరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం నుంచి ఊపిరి పీల్చుకోవాలంటే గ్రేటర్ విశాఖలో విజయం సాధించి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా ఈ సారి మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలనే ఆలోచనలో ఉంది వైసీపీ.

విశాఖలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక గ్రేటర్ విశాఖలో కొత్తగా విలీనమైన భిమిలీ, అనకాపల్లి మున్సిపాల్టిలతో పాటు గాజువాక నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తమ నియోజకవర్గంలో ఏయే ప్రాంతాల్లో ఏవరెవరికి ప్రజాదరణ ఉంది..ఎక్కడ పార్టీపై వ్యతిరేకత ఉందో బేరీజు వేసుకొని ఇప్పటి నుంచే తమ నియోజకవర్గంలో మరింత పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు ఎమ్మెల్యేలు.

ఇక నియోజకవర్గాల సమీకరణల్లో ఇంట్రస్టింగ్ ఈక్వెషన్స్ తెరమీదకు వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. విశాఖ నార్త్ లో మాజీ మంత్రి గంటాకు గట్టిపోటీ ఇచ్చిన కేకే రాజుపై ప్రజల్లో సానుభూతి ఉంది. దక్షిణంలో ద్రోనంరాజు శ్రీనివాస్, కోలాగురువులకు మంచి పట్టుంది. పశ్చిమంలో మళ్ల విజయ్ ప్రసాద్, తూర్పులో వంశీ జీవీఎంసీలో జెండా ఎగురవేస్తామని ధీమాగా చెబుతున్నారు. జగన్ కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలు ఉన్న అనకాపల్లి అమర్నాథ్ నగర ప్రజల నాడీ బాగా తెలిసిన వ్యక్తి.

సూదీర్ఘకాలంలో జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉంది. ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా.. జీవీఎంసీ ఎన్నికలను నిర్వహంచలేదనే మచ్చ టీడీపీని వెంటాడుతోంది. దీనికితోడు ఈ ఐదేళ్లలో ప్రజలకు తాము ఏం చేశామో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. నగరంలో మౌలిక సదుపాయాలు, స్మార్ట్ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దటంలో చేసిన కృషి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో టీడీపీ ఉంది. ఓవరాల్ నోటిఫికేషన్ వచ్చే నాటికి పాలక ప్రతిపక్షాలు జనంలో ఆదరణ మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story