అమిత్‌షాయే నంబర్‌-2.. కేబినెట్ కమిటీల్లో..

అమిత్‌షాయే నంబర్‌-2.. కేబినెట్ కమిటీల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా ఎనిమిది కేబినెట్‌ కమిటీల్లో ఆయనకు చోటివ్వడంతో మోదీ తర్వాత అమిత్‌షాయేనని అధికారికంగా ధ్రువీకరణ అయింది. ఏడు కమిటీల్లో సభ్యత్వంతో నిర్మలా సీతారామన్‌ ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. కేవలం రెండు కమిటీల్లోనే రాజ్‌నాథ్‌ పేరు ఉంచి ఆయన స్థానమేమిటో మోదీ చెప్పకనే చెప్పారు. ఆయన రాజీనామా చేస్తానని బెదిరించడంతో రోజంతా హైడ్రామా తర్వాత మరో నాలుగు కమిటీల్లో చోటిచ్చారు.

కమిటీల కూర్పులో హోంమంత్రి అమిత్‌ షా ప్రాధాన్యం అమాంతం పెరిగిపోయింది. దేశానికి సంబంధించిన ఆయా కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ముఖ్యకమిటీలన్నింటా ఆయనకు పెద్దపీట వేశారు. నీతి ఆయోగ్‌లోనూ ఆయన్ను ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నియమించారు. ఆర్థిక వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, భద్రతా వ్యవహారాలు, పెట్టుబడులు, వృద్ధి ఉపాధి నైపుణ్యాభివృద్ధి, నియామకాల కమిటీ, వసతి సౌకర్యాల కేబినెట్‌ కమిటీ.. మొత్తం 8 కమిటీలను కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. ప్రతి కమిటీలో అమిత్‌ షా సభ్యుడిగా ఉన్నారు. ప్రధాని సభ్యుడిగా లేని రెండు కమిటీల్లోనూ అమిత్‌ షా సభ్యుడిగా నియమితులయ్యారు. నియామకాల కేబినెట్‌ కమిటీ మినహా మిగతా 7 కమిటీల్లో నిర్మల సభ్యురాలిగా ఉన్నారు. ఈ కమిటీలతో షాను దాదాపుగా నెంబర్‌ టూ గా ప్రకటించారు.

కేబినెట్‌ కమిటీల ఏర్పాటుపై నరేంద్ర మోదీ సర్కారు తప్పటడుగు వేసి చివరకు తప్పు దిద్దుకుంది. ఎనిమిది కమిటీల్లో హోంమంత్రికి సభ్యత్వం కట్టబెట్టిన ప్రభుత్వం.. నిర్మలకు 7, పీయూష్‌ గోయెల్‌కు 5 కమిటీల్లో స్థానమిచ్చింది. కానీ అందరికంటే సీనియర్‌ అయిన రాజ్‌నాథ్‌సింగ్‌ను కేవలం రెండింటికే పరిమితం చేయడం దుమారం రేపింది. తనకు ప్రాధాన్యం తగ్గించడంపై మనస్తాపం చెందిన ఆయన చివరకు రాజీనామా చేస్తానని కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. చివరకు ఆర్‌ఎస్ఎస్‌ జోక్యంతో మోదీ దిగివచ్చారు. మరో నాలుగు కమిటీల్లో అంటే మొత్తం ఆరు కమిటీల్లో సభ్యుడిగా నియమించారు.

Tags

Read MoreRead Less
Next Story