బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్..

బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్..

విలక్షణ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ ఇకలేరు. కర్ణాటక నాటకరంగాన్ని ఓలలాడించిన కర్నాడ్, తన నివాసంలో తుది శ్వాస విడిచారు. క‌ర్నాడ్‌ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నివాళులర్పించారు. కర్నాడ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఇవాళ బప్పనహళ్లిలోని కాలపల్లిలో గిరీష్ కర్నాడ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. రచయితగా, నాటకకర్తగా కన్నడనాట తనదైన ముద్రవేసిన గిరిష్ కర్నాడ్ అనారోగ్య కారణాలతో బెంగళూరులో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 81 ఏళ్లు. కర్నాడ్ మృతితో కన్నడసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయరంగ ప్రముఖులు, కర్నాడ్ మృతిపై తీవ్ర సంతాపం తెలిపారు. కర్నాడ్ మృతి సినీ రంగంతో పాటు నాటక రంగానికి తీరని లోటు అని అభివర్ణించారు.

మహారాష్ట్రలోని మాథెరాన్ గ్రామంలో 1938 మే 19న గిరీష్ కర్నాడ్ జన్మించారు. కర్ణాటకలోని ధార్వాడ్, సిర్సీలలో పెరిగిన కర్నాడ్‌, ధార్వాడ‌లోని క‌ర్నాట‌క ఆర్ట్స్ కాలేజీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. ఆక్స్‌ఫ‌ర్డ్‌లో త‌త్వశాస్త్రం, రాజ‌నీతిశాస్త్రం, ఆర్థిక‌శాస్త్రాల‌ను అభ్యసించారు. ఆ సమయంలోనే ఆయనకు థియేటర్ ఆర్ట్‌పై మక్కువ ఏర్పడింది. నాటకరంగంపై ఇష్టంతో ఆ రంగంలోకి అడుగుపెట్టిన కర్నాడ్, కర్ణాటకలో నాటకరంగంపై తనదైన ముద్ర వేశారు. ఆధునిక క‌న్నడ నాట‌క రంగం గిరీశ్ క‌ర్నాడ్ ఆధ్వర్యంలోనే వృద్ధి చెందిందంటే అతిశయోక్తి కాదు. గ్రామాల్లో వేసే నాట‌కాలు కర్నాడ్‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాయి. దాంతో ర‌చ‌న‌ల‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. 1961లో య‌యాతి అనే నాట‌కం రాశారు. అది ఆయన మొదటి నాటకం. 1964లో తుగ్లక్, 1971లో హ‌య‌వ‌ద‌న నాట‌కాలను రచించారు. అవి కర్ణాటకలో సూపర్ సక్సెస్ అయ్యాయి. దాంతో కన్నడ భాషలోనే ఆయన రచనలు కొనసాగించారు. ఆ తర్వాత వాటిని ఇంగ్లిష్‌తో పాటు ఇత‌ర భాష‌ల‌కు అనువ‌దించారు. క‌న్నడలో ఆయ‌న రాసిన పుస్తకాలు ఆణిముత్యాలే అని చెప్పాలి. థియేట‌ర్ ఆర్ట్‌లో కూడా ఆయ‌న‌కు ఆయనే సాటి.

సినీరంగంలోనూ చెరగని ముద్రవేశారు గిరీష్ కర్నాడ్. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ చిత్రాల్లో అసమాన నటనతో మెప్పించారు. 1970లో వ‌చ్చిన సంస్కార చిత్రంలో గిరీష్ కర్నాడ్ నటన ప్రేక్షకులను మెప్పించింది. నిషాంత్‌, మంథ‌న్‌, డోర్లాం టి హిందీ చిత్రాలోనూ న‌టించిన కర్నాడ్, తెలుగులో ధర్మచక్రం, శంకర్ దాదా ఎంబీబీఎస్’ ‘కొమరం పులి’ చిత్రాల్లో ఆయన నటించారు. ‘ధర్మచక్రం’లో వెంకటేష్ తండ్రిగా, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి తండ్రిగా నటించిన గిరీష్ కర్నాడ్ తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. నటనతో పాటు దర్శకత్వంలోనూ తన ప్రతిభ నిరూపించుకున్నారు గిరీష్ కర్నాడ్. 1971లో రిలీజైన వంశ‌వృక్ష, 1984లో వ‌చ్చిన ఉత్సవ చిత్రాల‌ను ఆయ‌న డైర‌క్ట్ చేశారు. టీవీ ప్రేక్షకుల‌కు గిరీశ్ కర్నాడ్ మ‌రీ ప్రత్యేకంగా క‌నిపిస్తారు. మాల్గుడి డేస్‌, ఇంద్రధ‌నుష్ లాంటి సీరియ‌ళ్లలో గిరీశ్ న‌టించారు. గ‌త ఏడాది రిలీజైన టైగ‌ర్ జిందా హై హిందీ సినిమాలో గిరీశ్ చివ‌రిసారి క‌నిపించారు. ఆయన ఆఖరి సినిమా కన్నడ భాషలోనే నిర్మించిన అప్నా దేశ్. స్కెచ్ ఫర్ లవ్ అనే సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది.

రాజ‌కీయాల్లోనూ గిరీశ్ క‌ర్నాడ్ కీల‌క పాత్ర పోషించారు. మ‌త‌ఛాంద‌స‌వాదుల‌ను తీవ్రంగా విమర్శించేవారు. ఆయన బహుముఖ ప్రజ్ఞకు పురస్కారాలు వరుస కట్టాయి. సాహిత్య రంగంలో ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులు ఇచ్చింది. సినిమాలకు సంబంధించి ఆయన ఏడు ఫిలింఫేర్, 10 నేషనల్ అవార్డులు అందుకున్నారు.అనేక చిత్రాల‌కు జాతీయ ఫిల్మ్ అవార్డుల‌ను స్వీక‌రించారు. వంశ వృక్షం సినిమాకు బెస్ట్ డైరక్టర్ అవార్డు గెలుచుకున్నారు. గిరీష్ కర్నాడ్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ, సాహిత్య రంగానికి తీరని లోటని అన్నారు. కర్ణాటకలో కుమారస్వామి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ప్రముఖ నటుడు గిరీశ్‌ కర్నాడ్‌ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. గిరీష్ కర్నాడ్ మరణ వార్త కలిచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తూ సంతాపం తెలిపారు. మరోవైపు ఇవాళ బప్పనహళ్లిలోని కాలపల్లిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story