ఆమె హీరో ఆఫ్ ది పార్లమెంట్..సంతకం చేయడం మర్చిపోయిన రాహుల్

ఆమె హీరో ఆఫ్ ది పార్లమెంట్..సంతకం చేయడం మర్చిపోయిన రాహుల్

సభలో అర్థవంతమైన చర్చ జరగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల అభిప్రాయాలు చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. 17వ లోక్‌సభ తొలి రోజు సమావేశాలు మొత్తం ప్రమాణస్వీకారాలతోనే ముగిసింది. అయితే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రమాణ స్వీకార సమయంలో సభ కరతాళ ధ్వనులతో మారుమోగింది. మరికొంతమంది సభ్యులు ఇవాళ కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

17వ లోక్‌సభ తొలి రోజు సమావేశాలు కేవలం ప్రమాణ స్వీకార కార్యక్రమానికే పరిమితం అయ్యింది. ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు.. భారత్‌ మాతాకీ జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు.

విపక్షాలు తమ సంఖ్యాబలం గురించి మర్చిపోవాలని, ప్రజాస్వామ్యంలో విపక్షాల అభిప్రాయాలు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. ఎలాంటి సంఘర్షణ లేకుండా, ప్రజాధనం వృథా కాకుండా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు.

మోదీ తర్వాత కేరళ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సీనియర్ ఎంపీ సురేశ్‌ కొడికున్నిల్‌ ప్రమాణం చేశారు. వరుసగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, హర్‌సిమ్రత్‌ కౌర్‌, స్మృతి ఇరానీ తదితరులు ప్రమాణం చేశారు. వీరితో ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్ ప్రమాణం చేయించారు.

బీజేపీ ఎంపీలు, సంజయ్ అరవింద్, బాబూరావులు కలిసి పార్లమెంట్‌కు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.. మోదట హోంమంత్రి కార్యాలయం వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించి.. తరువాత లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో హిందిలో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. లోక్‌సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రమాణ స్వీకారం సమయంలో సభ్యుల కరతాళ ధ్వనులతో సభ మార్మోగింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్య క్షుడు రాహుల్‌గాంధీపై స్మృతీ ఇరానీ సంచలన విజయం సాధించారు. ఆమె వేదిక వద్దకు వచ్చిన దగ్గరి నుంచి బీజేపీ సభ్యులతో పాటు ప్రధాని మోదీ కూడా హర్షాతిరేకాల మధ్య బల్లలు చరుస్తూ ఆమెను అభినందించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం తరువాత పార్లమెంటు రిజిస్టర్‌లో సంతకం చేయడం మర్చిపోయి, తన స్థానం దగ్గరకు వెళ్లబోయారు. అక్కడే ఉన్న అధికారులు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా ఇతర ఎంపీలు ఆయనకు ఆ విషయాన్ని గుర్తు చేశారు.

మిగిలిన ఎంపీల ప్రమాణ స్వీకారం అక్షర క్రమంలో జరిగింది. మొదటగా అండమాన్‌ నికోబార్‌ ఎంపీలు ప్రమాణం చేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్ ఎంపీల వంతు వచ్చింది. ఏపీ ఎంపీల్లో మొదట అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తెలుగులో ప్రమాణం చేశారు. తరువాత వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. 12 మంది తెలుగులో, 11 మంది ఇంగ్లీషులో, ఇద్దరు హిందీలో ప్రమాణం చేశారు.

ఇవాళ కూడా ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. ఈ నెల 19 బుధవారం నాడు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 20వ తేదీన ఉభయసభను ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story