సీఎం నిర్ణయంతో జూనియర్‌ డాక్టర్లలో ఆనందం

సీఎం నిర్ణయంతో జూనియర్‌ డాక్టర్లలో ఆనందం

దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించిన జూనియర్‌ వైద్యులు సమ్మెను విరమించారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో సమావేశం తరువాత వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు మమతా ఒప్పుకోవడంతో జూనియర్‌ డాక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. నేటి నుంచి విధుల్లో చేరుతున్నట్టు ప్రకటించారు..

దేశ వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్ల సమ్మె కలకలం రేపింది. మొదట కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్ల మీద పేషెంట్ తరఫు బంధువులు దాడి చేయడంతో వివాదం మొదలైంది. అది దేశవ్యాప్తంగా పాకింది. గత వారం రోజులుగా ఆందోళనలు కొనసాగించారు.

కోల్‌కతాలోని వైద్యుల సమ్మెకు మద్దతుగా సోమవారం దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు దిగారు. అత్యవసర సేవలు మినహా సాధారణ సేవల సిబ్బంది విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో చాలా ప్రాంతాల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. పరిస్థితులు అదుపుతప్పిపోతుండటంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగొచ్చారు. రాష్ట్రంలోని ఒక్కో ఆసుపత్రి నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున మొత్తం 31 మంది ప్రతినిధులతో చర్చలు జరిపారు. వైద్యుల డిమాండ్‌ మేరకు సీఎంతో జరిగే సమావేశం మొత్తాన్ని రికార్డు చేసేందుకు అంగీకరించారు.

వైద్యుల భద్రత కోసం 10 భద్రతా చర్యలను మమత బెనర్జీ ఈ సమావేశంలో సూచించారు. ప్రతి ఆసుపత్రిలో నోడల్ పోలీస్ అధికారిని ఏర్పాటు చేయాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్ అనుజ్ శర్మను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యల పరిష్కారానికి సంబంధించిన గ్రీవెన్స్ రీడ్రెసెల్ సెల్ ఏర్పాటు చేయాలన్నప్రతిపాదనకు అంగీకరించారు. వైద్యులపై తప్పుడు కేసులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దాడి ఘటనలో ప్రమేయమున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని, ఐదుగురిని అరెస్టు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. మమత హామీతో సంతృప్తి చెందిన వైద్యులు సమ్మెను విరమిస్తున్నట్టు తెలిపారు..

వైద్యుల డిమాండ్లను నెరవేర్చేందుకు సీఎం అంగీకరించడంతో వారం రోజుల ప్రతిష్ఠంభనకు తెరపడింది. దేశవ్యాప్తంగా సమ్మెకు సహకరించిన సీనియర్‌ వైద్యులు, జూనియర్‌ డాక్టర్లు, సాధారణ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఇవాళ ఇదే అంశానికి సంబంధించిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story