ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత శుభాకాంక్షలు తెలిపిన మొదటి వ్యక్తి ఆయనే.. - మోదీ

ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత శుభాకాంక్షలు తెలిపిన మొదటి వ్యక్తి ఆయనే.. - మోదీ

జపాన్‌లోని ఒసాకాలో 28, 29 తేదీల్లో జరిగే జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ జపాన్ చేరుకున్నారు. ముందుగా మోదీ... జపాన్‌ PM షింజో అబేతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ప్రపంచ వాణిజ్యం, వాతావరణ మార్పులు సహా ద్వైపాక్షిక అంశాలపైనా చర్చించారు. ఇండో-జపాన్‌ సంబంధాలపైనా విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైల్‌ ప్రాజెక్టుతో పాటు వారణాసిలో నిర్మించే కన్వెన్షన్‌ సెంటర్‌పైనా చర్చించారని అధికారులు వెల్లడించారు.

లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న ప్రధాని మోదీకి షింజో అబె అభినందనలు తెలిపారు. భారత్‌లో పర్యటించడం ఇప్పుడు తనవంతని, దాని కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. తాను ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఫోన్‌ చేసి, శుభాకాంక్షలు తెలిపిన మొదటి వ్యక్తి షింజో అబేనని మోదీ గుర్తుచేశారు. జపాన్ ప్రభుత్వం ఇచ్చిన ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు.

భారత్‌, అమెరికా, జపాన్‌ దేశాధినేతల త్రైపాక్షిక చర్చల సందర్భంగా ఇరువురు నేతలు శుక్రవారం మరోసారి సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ సహా పలు దేశాధినేతలతో సంప్రదింపులు జరపనున్నారు ప్రధాని మోదీ. అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన పలు అంశాలతో పాటు భారత్‌ దృక్కోణాన్ని ఈ చర్చల సందర్భంగా అంతర్జాతీయ నేతల ముందు ప్రధాని మోదీ వెల్లడిస్తారని పీఎంఓ ట్వీట్టర్ లో పేర్కొంది. మోదీ- ట్రంప్‌ మధ్య శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరగనున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ట్రేడ్‌ వార్‌ మొదలైంది. ఇటీవల అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై అదనపు కస్టమ్స్‌ డ్యూటీ విధించింది భారత్. దీనిపై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అసంబద్దమని ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. వెంటనే పెంచిన పన్నులు తగ్గించాలని మోదీకి సూచించారు. అటు అమెరికా జీఎస్పీ హోదా రద్దు చేయడాన్ని తెరపైకి తెస్తోంది భారత్. ఈ రెండు అంశాలపై మోదీ- ట్రంప్‌ చర్చల్లో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story