ప్రాణాల మీదకు తెస్తున్న సరదా.. 24 గంటల్లోనే 9మంది మృతి

సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. నీటి గుండాలే యమగండాలవుతున్నాయి. కళ్లెదుటే ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి. గత 24 గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 9 మంది చనిపోయారు. అయిన వాళ్లకు తీరని విషాదాన్ని మిగిల్చారు.

ఎండలు మండిపోతున్నాయి. వేసవిసెలవులూ పొడిగించారు. ఇంకేముంది..భానుడి భగభగల నుంచి ఉపశమనం పొందేందుకు చెరువులు, వాగులను ఆశ్రయిస్తున్నారు జనం. ఆ సరదానే ప్రాణాలు తీస్తోంది. పిల్లలకు నీళ్లంటే ఏదో తెలియని సంతోషం. అందుకే కాస్త టైమ్ దొరికే చాలు ఈత అంటూ వాలిపోతారు. తెలిసితెలియని వయస్సులో చేసే ఆ చిన్నతప్పులతో ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి. గుంటూరు జిల్లా చిరుమామిళ్లలో వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన జశ్వంత్‌,మణికంఠ ఇద్దరూ మంచి మిత్రులు. వేసవి సెలవులు కావడంతో సమీపంలోని నక్కవాగు వద్దకు వెళ్లారు. చేపపిల్లలను పట్టే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఇద్దరూ అందులో పడిపోయి మృతిచెందారు. చిన్నారుల మృతితో గ్రామమంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విశాఖ జిల్లా బందవీధికి చెందిన ప్రేమకరావు అనే బాలుడు కూడా ఈత కోసం వెళ్లి మృతి చెందాడు. స్నేహితులంతా కలిసి గ్రామానికి సమీపంలోని కుంట వద్దకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టారు. అయితే ప్రేమకరావు..లోతు ఎక్కువగా ఉన్నవైపు వెళ్లడంతో నీటిలో మునిగిపోయాడు. గజఈతగాళ్ల సహాయంతో బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు.

మేడ్చల్‌ జిల్లా గాజులరామారంలో మరో విషాదకర ఘటన. బాలయ్యనగర్‌లోని క్వారీ నీటి గుంతలో పడి ముగ్గురు చనిపోయారు. మృతులను ఐలమ్మ, అనిత, యశ్వంత్‌గా గుర్తించారు. ఈ ముగ్గురూ కర్ణాటకలోని యాద్గిర్‌ జిల్లాకు చెందిన వారు. బాలయ్యనగర్‌లోని బంధువుల ఇంట్లో వివాహానికి వచ్చారు. సమీపంలోని క్వారీగుంతలో దుస్తులు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తూ అందులో పడి చనిపోయారు.

శనివారం జనగామ జిల్లా బొమ్మకూరు రిజర్వాయర్ లో కళ్లెదుటే ముగ్గురి ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి..సంగీత, సుమలత అనే ఇద్దరు యువతులు బావ వరసయ్యే అవినాష్‌ దంపతులతో కలిసి సరదాగా జలాశయం దగ్గరకు వెళ్లారు. మోకాలి లోతు నీళ్లలో దిగి ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ సరదాగా గడిపారు. చూస్తుండగానే పక్కనే ఉన్న గుంతలో పడి ముగ్గురు మునిగిపోయారు. వీరిని వీడియో తీస్తున్న అవినాష్ భార్య కేకలు విని సమీపంలోని రైతులు పరుగున వచ్చారు. కానీ అప్పటికే అందరూ చనిపోయారు. నీరు చాలా డేంజర్. అందుకే చెరువులు, కుంటల వద్దకు వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే ప్రమాదం ఏ రూపంలోనైనా ముంచుకురావచ్చు.

Tags

Read MoreRead Less
Next Story