సీఎంగా బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకముందే..

ఏపీ సీఎం జగన్‌.. తనదైన మార్కు చూపిస్తున్నారు. పూర్తిస్థాయిలో పాలనపై పట్టుబిగించే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ప్రజా సమస్యలు, అవసరాలపై సమీక్షలతో బిజీగా మారారు. సోమవారం జల వనరులు, వైద్య ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన సీఎం జగన్‌..ఇవాళ వ్యవసాయం, గృహనిర్మాణ శాఖలపై సమీక్ష జరపనున్నారు.

ఆశా వర్కర్లకు తీపి కబురు అందించింది ఏపీ ప్రభుత్వం. వారి జీతం ఏకంగా 10 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 3 వేలు అందుకుంటున్నవారికి ఒకేసారి 7 వేలు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్‌. సోమవారం వైద్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సీఎం జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఆశా వర్కర్లు….

ఈ సమీక్షా సమావేశంలోనే ఎన్టీఆర్ వైద్యసేవ పేరును డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ శాఖ సమూల ప్రక్షాళనకు ఓ కమిటి వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పి.వీ. రమేష్‌ ఆధ్వర్యంలోని ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. ఈ కమిటీని ఆరోగ్యశాఖ పనితీరుపై 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. ఇక…. 108, 104 సర్వీసులను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటు హాస్పిటళ్ల కంటే మెరుగ్గా తీర్చిదిద్దాలని అన్నారు. వైద్యఆరోగ్యశాఖ తనకు అత్యంత ప్రాధాన్యతతో కూడినదని చెప్పిన జగన్‌… దీన్ని తానే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పోస్టుల భర్తీ, ఆర్ధిక అవసరాలు, మౌలిక వసతలపై తక్షణమే నివేదిక రూపొదించాలని అధికారుల్ని ఆదేశించారు…..

అనంతరం … జలవనరుల శాఖ అధికారులతోనూ సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం జగన్‌. పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. రెండేళ్లలో పనులు పూర్తవుతాయని అధికారులు తెలపగా.. రాజీ పడవద్దని.. త్వరలోనే ప్రాజెక్టు పనులు పరిశీలిస్తానని చెప్పారు. అలాగే గోదావరి జలాలను వీలైనంత ఎక్కువగా వినియోగించేలా చూడాలన్నారు. అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాజెక్టులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ నెల 6 వ తేదీన మరోసారి జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌లో అవినీతికి తావు ఉండకూడదన్న సీఎం…. సమగ్ర సమాచారంతో తదుపరి సమీక్షా సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు…..

సీఎంగా బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకముందే పాలనలో తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ శాఖల ప్రక్షాళనకు నడుం బిగిస్తూ.. మరోవైపు ప్రజలకిచ్చిన హామీలపై ఫోకస్‌ చేస్తున్నారు. సమీక్షలు.. సమావేశాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బిజీ అయ్యారు. ఇవాళ ఉదయం వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం గృహనిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story