ఉత్తమ అధికారి .. ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు, బంగారం

ఉత్తమ అధికారి .. ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు, బంగారం

ఆన్‌లైన్‌లో పేరు నమోదుకు రైతు నుంచి 4 లక్షలు లంచం తీసుకుంటూ... ఓ వీఆర్వో ఏసీబీకి చిక్కాడు.. మొత్తం 8 లక్షలు డిమాండ్‌ చేసిన వీఆర్వో.. దాంట్లో 5 లక్షలు తహసీల్దార్‌ వాటా అని చెప్పాడు. వెంటనే ఏసీబీ అధికారులు ఆ మహిళా తహసీల్దార్‌ను విచారించారు. ఆమె తనకు

ఏం సంబంధం లేదన్నారు. తీరా, ఆమె ఇంట్లో తనిఖీలు చేస్తే.. నోట్ల కట్టలు, గుట్టలు గుట్టలుగా కనిపించాయి...వీఆర్వో దగ్గర తీగ లాగితే... తహసీల్దార్ ఇంట్లో డొంక కదిలింది... కట్టలకొద్దీ డబ్బు.. తులాలకొద్దీ బంగారు ఆభరణాలు.. విలువైన ఆస్తుల పత్రాలు.. ఇవన్నీ ఏ బడా వ్యాపారి ఇంట్లోనో దొరకలేదు... కేశంపేట తహసీల్దార్‌ లావణ్య ఇంట్లో ఏసీబీ జరిపిన సోదాల్లో బయటపడ్డాయి... హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని శాంతినగర్‌లో ఉన్న ఆమె ఖరీదైన ఫ్లాట్‌లో ఎక్కడ వెతికినా 2 వేలు, 5 వందల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ డబ్బుని చూసి ఏసీబీ అధికారులే షాక్ తిన్నారు...బెడ్‌రూంలోని బీరువాలు, కప్‌ బోర్డుల్లోనూ భారీగా డబ్బు కట్టలు లభించాయి. సుమారు 3 గంటల పాటు నిర్వహించిన సోదాల్లో 93 లక్షల 50 వేల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా...కేశంపేట మండలం దత్తాయపల్లికి చెందిన మామిడిపల్లి చెన్నయ్యకు 12 ఎకరాల భూమి ఉంది. అందులో 9.7 ఎకరాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో అతని పేరు నమోదు కాలేదు. దీనిపై చెన్నయ్య కుమారుడు భాస్కర్‌ , వీఆర్వో అనంతయ్యను సంప్రదించాడు. ఎకరాకు లక్ష చొప్పున 9 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనని భాస్కర్‌ చెప్పడంతో 8 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్నిభాస్కర్‌ ఏసీబీ అధికారులకు తెలిపాడు. కొందుర్గులో భాస్కర్‌ నుంచి అనంతయ్య 4 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు...ఇందులో 5 లక్షలు కేశంపేట తహసీల్దార్‌ లావణ్యకు, 3 లక్షలు తనకని వీఆర్వో అనంతయ్య చెప్పాడు...

అలా వీఆర్వో అనంతయ్య ఏసీబీ ఇచ్చిన సమాచారంతో కేశంపేట తహసిల్దార్‌ లావణ్య ఇంట్లో సోదాలు జరిపారు అధికారులు. లావణ్యను రెండేళ్ల కిందట ప్రభుత్వం ఉత్తమ అధికారిగా కూడా ఎంపిక చేసింది. అప్పటి డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ నుంచి ఆమె ప్రశంసా పత్రం కూడా అందుకున్నారు. కానీ, ఇప్పుడు లంచం కేసులో ఆమె ఏసీబీకి చిక్కారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఆమెను విచారించారు. వీఆర్వో తీసుకున్న లంచంతో తనకు సంబంధం లేదని ఆమె ఏసీబీ అధికారులకు తెలిపారు. కానీ, వీఆర్వో తీసుకున్న లంచంతో లావణ్యకు సంబంధం ఉందని, ఈ మేరకు తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని డీఎస్పీ స్పష్టం చేశారు...షాద్‌నగర్‌ ఆర్డీవో, కేశంపేట తహసీల్దారు కార్యాలయంలోని అధికారుల పాత్రపైనా విచారణ చేపడతామని వెల్లడించారు. అటు వీఆర్వో అనంతయ్యను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story