హైదరాబాద్‌ వాసుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

హైదరాబాద్‌ వాసుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

హైదరాబాద్‌ మహానగరం దాహార్థిపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌ చేసింది. జలమండలి నళ్లాలు, ట్యాంకుల ద్వారా సప్లై చేస్తున్న నీరు ఏ మూలకు సరిపోవడం లేదని గుర్తించింది. తాగునీటి సమస్యలను అధిగమించడంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

నగరానికి ఎప్పటికీ త్రాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు వెంటనే డెడికేటెడ్ మంచినీటి రిజర్వాయర్ నిర్మించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి గోదావరి నీటిని తరలించి, ప్రతిపాదిత మంచినీటి రిజర్వాయర్ ను ఎప్పటికప్పుడు నింపుతూ పోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి పారుదల శాఖ అధికారులు, RWS అధికారులు సంయుక్తంగా సమావేశమై మంచినీటి రిజర్వాయర్‌, పైపులైన్లకు సంబంధించి అంచనాలు తయారుచేయాలని నిర్దేశించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతీ ఇంటికీ మంచినీటి కనెక్షన్ ఇవ్వాలన్నారు.

ప్రస్తుతం సుదూరాల నుంచి తరలిస్తున్న గోదావరి, కృష్ణా నీరు హైదరాబాద్‌కు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు కేసీఆర్. భవిష్యత్‌లో ఇలా జరగడానికి వీల్లేదని చెప్పారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు నీటి సరఫరా జరుతుందని, వీటిలో పది శాతం తాగునీటి అవసరాలకు వాడుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ రెండు రిజర్వాయర్ల నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించడానికి కేశవరం దగ్గర రిజర్వాయర్, వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంటు నిర్మించాలని ఆదేశించారు. అక్కడి నుంచి నగరానికి మంచినీటి సరఫరా జరగాలని సూచించారు. రిజర్వాయర్ కోసం వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.

హైదరాబాద్‌ మంచి నీటి సమస్యను దూరం చేసేందుకు... గోదావరి, కృష్ణా నీటిని ప్రస్తుత పద్థతిలో తరలిస్తూనే ప్రత్యామ్నాయంగా రిజర్వాయర్ కూడా నిర్మించాలని కేసీఆర్ సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story