తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 లేదా 31వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. అందుకు కసరత్తు కూడా వేగవంతం చేసింది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో వార్డుల విభజన తుది దశకు చేరుకోంది. దీంతో ఈ నెల 14న ఓటర్ల తుది జాబితాను ప్రకటించి..16న ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్ చేయాలని చూస్తుంది.

ఎన్నికల నిర్వహణపై చర్చించి..అభ్యంతరాలు స్వీకరించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నెల 14న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని.. అప్పటికల్లా రిజర్వేషన్లు కూడా ఖరరావుతాయన్నారు. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పురపాలికల్లో 50 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారని, బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలను నిర్వహిస్తామని నాగిరెడ్డి స్పష్టంచేశారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో దాదాపు 800 మంది ఓటర్లు ఉంటారని తెలిపారు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లకు 2లక్షలు.. కార్పొరేషన్లలో కార్పొరేటర్లకు 3లక్షల వ్యవపరిమితిని నిర్దేశించినట్లు నాగిరెడ్డి వెల్లడించారు. గుర్తింపు పొందిన పార్టీలకు వారి గుర్తులను కేటాయిస్తామని, గుర్తింపు పొందని పార్టీలకు నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చెప్పారు.

మరోవైపు మున్సిపల్ ఎన్నికలను హడావిడిగా నిర్వహించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు 4 నెలలు గడువు ఇచ్చినా ప్రభుత్వ ఒత్తిళ్ళకు తలొగ్గి ఎన్నికల కమిషన్ హడావిడి చేస్తుందని మండిపడుతున్నాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం 30 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిందని టీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్ రావు అన్నారు. పార్టీలు ఓ వైపు ఎన్నికలు నిర్వహించాలని తొందర పెడుతూ.. మరోవైపు ప్రకటించిన తరువాత ఎన్నికలను వాయిదా కోరడం దురదృష్టకరమని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికలకు భయపడదని..ఎన్నికలను ఆహ్వానిస్తున్నామన్నారు గట్టు రాంచందర్.

విపక్షాల ఆరోపణలు, విమర్శలు ఎలా ఉన్నా ఈనెల చివరి నాటికే ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని కసరత్తు మాత్రం వేగవంతం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.

Tags

Read MoreRead Less
Next Story