జోరు వానలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి పోటెత్తుతున్న వరద

జోరు వానలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి పోటెత్తుతున్న వరద

భారీ వర్షాలకు తెలంగాణలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి వరద పోటెత్తుతోంది. మేడిగడ్డ బ్యారేజీ 40 గేట్లను ఎత్తి 2లక్షల 91 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. అటు అన్నారం బ్యారేజీ పూర్తి నీటి సామర్థ్యం 10.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.68 టీఎంసీలు నీరు ఉంది. ఇన్ ప్లో 79 వేల క్యూసెక్కులు వస్తోంది. అధికారులు 17 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్‌ జిల్లాలోని కాకతీయుల కాలం నాటి రామప్ప, లక్నవరం సరస్సులు నిండు కుండలా మారాయి. ములుగు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో వాగులు, పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. ఏటూరునాగారం మండలంలోని షా పల్లి దగ్గర జీడి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో షాపల్లి, దొడ్ంల, కొండయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా అతలాకుతలమవుతోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్‌ వద్ద.. 8.50 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. నీల్వాయి వాగు ఉధృతికి గొర్లపల్లి వాగు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వానలకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. పంట పోలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వేల ఎకరాల వరి , ప్రత్తి పంటలు నీటమునిగాయి. అటు మల్హర్ రావు మండలం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రోజుకి 4వేల టన్ను బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచ మండంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోంది. ప్రాజెక్టు సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 403 అడుగులకు చేరగా అధికారులు మూడు గేట్ల ద్వారా 15వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కిన్నెర సాని అందాలను తిలకించడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు 27 గేట్లు ఉండగా, 25 గేట్లు పూర్తిగా ఎత్తి లక్షా 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలంలో గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story