అన్న పోలీసు.. చెల్లి మావోయిస్టు.. ఒకరిపై ఒకరు..

అన్న పోలీసు.. చెల్లి మావోయిస్టు.. ఒకరిపై ఒకరు..

ఒకే తల్లి బిడ్డలు.. దారులు వేరు.. చెల్లి అడవి బాట పట్టి తుపాకులు చేతబట్టింది. అన్న అడవి బిడ్డలపై తుపాకీ ఎక్కుపెట్టే పోలీస్ ఉద్యోగం. ఎవరి సిద్దాంతాలు వారివి. అయినా రక్త సంబంధం ఆ అన్నను ఆలోచింపజేసింది. చెల్లి మాత్రం కన్నీటిని కనుకొనల్లునే దాచుకుని అన్నపై గుళ్ల వర్షం కురిపించింది. చత్తీస్‌ఘడ్‌కు చెందిన కమాండర్ వెట్టి రామ ఆధ్వర్యంలో జులై 29న 140 మంది పోలీసులు సుక్మా జిల్లాలోని బలేంగ్తాన్‌లో మావోయిస్టుల క్యాంపును చుట్టుముట్టారు. కొంటా ప్రాంతానికి చెందిన సీపీఎం (మావోయిస్టు) కమిటీకి చెందిన ముఖ్య సభ్యుల కోసం జల్లెడ పట్టారు. ఆ సమయంలో ఓ మహిళా మావోయిస్టు రామ కంటపడింది.

చెల్లిని చూసి అన్నకు కాలు కదల్లేదు. ఆమెపై తుపాకీ ఎక్కుపెట్టలేకపోయాడు. రక్త సంబంధం అడ్డువచ్చింది. అయినా తమాయించుకుని లొంగిపొమ్మని కోరాడు. అదే సమయంలో చెల్లెలికి భద్రతగా ఉన్న మిగతా సభ్యులు రామపై కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు రెప్పపాటులో అతడు కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. ఎదురు కాల్పులు జరిపే సరికి ఆమె అక్కడినుంచి దట్టమైన అడవుల్లోకి పారిపోయింది. గగన్‌పల్లికి గ్రామానికి చెందిన అన్నా చెల్లెళ్లు.. రామ, కన్నీలు ఇద్దరూ 1990లో మావోయిస్టుల ఉద్యమంలో చేరారు. ఇద్దరూ మావోయిస్టుల సిద్ధాంతలను పుణికి పుచ్చుకుని ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

అయితే, ఒకానొక క్రమంలో మావోయిస్టు ఉద్యమంలొ చిత్తశుద్ధి లోపించిందని భావించిన రామ పోలీసులకి లొంగిపోయాడు. కానీ చెల్లి కన్నీ మాత్రం దళంలోనే ఉండిపోయింది. ఆ తరువాత రామ పోలీసులతో కలిసి 10 భారీ ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆ తరువాత కొద్ది నెలలకే రామకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. డ్యూటీలో భాగంగా మావోయిస్టుల కోసం గాలిస్తున్న సమయంలో రామకి చెల్లి కన్నీ ఎదురైంది. ఆమెపై కాల్పులు జరపడానికి అన్నకి మనసు రాలేదు. కానీ, సెకన్ల వ్యవధిలోనే ఆమె దళం వారిపై కాల్పులు జరిపింది. తరువాత ఆమె కూడా కాల్పులు జరుపుతూ అడవిలోకి వెళ్లి పోయింది అని రామ తెలిపారు. మావోయిస్టు దళంలో కీలక నేతగా ఎదిగిన కన్నీ తలపై రూ.5లక్షల రివార్డు ఉంది.

Tags

Read MoreRead Less
Next Story