వైసీపీ పేటీఎం బ్యాచ్‌కు ఒక్క ఫోన్‌ కొడితే.. - చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఆశావర్కర్ల ఆందోళనపై ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు. జగన్‌ ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా! అంటూ సూటిగా ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. ఆశా వర్కర్లకు నెల జీతం 10 వేల రూపాయలకు పెంచేశాం అంటూ ఫోటోలకు పోజులిస్తూ.. మరోవైపు వారిని ఏకంగా ఉద్యోగంలోంచి తీసేసే జీవో ఇస్తారా అంటూ నిలదీశారాయన.

ఆశావర్కర్ల కష్టానికి గ్రేడ్‌లు ఏంటంటూ చంద్రబాబు ప్రశ్నించారు. చిన్న చిన్న ఉద్యోగులపై థర్డ్‌గ్రేడ్ కుట్రలు ఎలా చేయగలుగుతున్నారని నిలదీశారు. ఒక్కో ఆశా కార్యకర్త పనితీరుపై పదిమంది తీర్పులు ఇవ్వాలా అంటూ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తంచేశారు ప్రతిపక్షనేత. వాళ్లను ఇష్టారీతిన వేధించే దుర్మార్గపు జీవోలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఆశావర్కర్‌కు ప్రభుత్వం ప్రతి నెలా 10 వేల రూపాయల జీతం ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలన్నారు చంద్రబాబు.

ఆశావర్కర్లను వేధింపులకు గురిచేయకుండా.. వారికి ప్రతి నెలా 10 వేల రూపాయల జీతం ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా, లేదా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. ఒకవేళ ఇచ్చే ఆలోచన లేకపోతే.. మీ ఆయుధాన్ని బయటకు తీయండి అంటూ సెటైర్ వేశారు. వైసీపీ పేటీఎం బ్యాచ్‌కు ఒక్క ఫోన్‌ కొడితే.. ఆందోళన చేస్తున్న ఆశావర్కర్లను పెయిడ్‌ ఆర్టిస్టులుగా మార్ఫింగ్‌ చేస్తారంటూ విమర్శలు చేశారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా.. ఇలా చేయడం మామూలేనంటూ కౌంటర్‌ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆందోళన చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులుగా మార్ఫింగ్ చేయడం మీకు మామూలేగా అంటూ చురకలంటించారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా.. మీకిది మామూలే కదా అంటూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story