ఒక్కో పొట్టేలు ధర ఎంతో తెలుసా..

ఒక్కో పొట్టేలు ధర ఎంతో తెలుసా..

బక్రీద్ సీజన్లో పొట్టేళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణ ధరల కన్నా ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువకు పొట్టేళ్లను అమ్ముతున్నారు వ్యాపారులు. చిత్తూరు జిల్లాలో మేకలు, పొట్టేళ్ల రేట్లు చూసి కొనుగోలుదారులు హడలిపోతున్నారు. మాములు రోజుల్లో 10 నుంచి 15 వేలు పలికే పొట్టేళ్ల ధర..బక్రీద్ డిమాండ్ తో 30 నుంచి 50 వేలకు పెరిగింది. దిమ్మతిరిగేలా పెరిగిన ధరలతో పండగ ఎలా చేసుకోవాలని ఆందోళన చెందుతున్నారు ముస్లింలు.

పొట్టేళ్లు సంతకు పేరుగాంచిన బైరెడ్డిపల్లి సంతకు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున పొట్టేళ్లు, మేకలు తీసుకొచ్చారు. బక్రీద్ కావటంతో ఇతర రాష్ట్రాల వివిధ జాతులను మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. కశ్మీర్ నుంచి తీసుకొచ్చిన పొట్టేళ్లకు అన్నింటికంటే ఎక్కువ డిమాండ్ ఉంది. మేక శరీరంపై చారలను బట్టి 50 వేలకు మించి కూడా ధరలు చెబుతున్నారు. స్టార్ గుర్తులు, అర్ధచంద్రాకారం చారలు ఉన్న మేకలు ఎక్కువ ధర పలుకుతున్నాయి.

బక్రీద్ వేళ ప్రార్థనల తర్వాత పొట్టేళ్లు, మేక మాంసాన్ని స్నేహితులు, దగ్గరివారితో కలిసి తినడం మామూలే. దాదాపు ప్రతీ ముస్లిం బక్రీద్ రోజున మేకను బలిస్తారు. అయితే..ఏకంగా నాలుగు రెట్లు ధర ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో పొట్టేళ్లు ఉన్నా కొనేందుకు మాత్రం జంకుతున్నారు. ఒక్కో పొట్టేలును కొనేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story