శృతిమించిపోతున్న వైసీపీ నేతల ఆగడాలు.. మహిళపై..

శృతిమించిపోతున్న వైసీపీ నేతల ఆగడాలు.. మహిళపై..

ఏపీలో ప్రభుత్వం మారగానే వైసీపీ నేతల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. మొన్నటివరకు టీడీపీ నేతలపై భౌతిక దాడులకు దిగిన అధికారపార్టీ ఇప్పుడు చిరుద్యోగులను కూడా వదలటం లేదు. గుంటూరు జిల్లా ఈపూరు ICDS ప్రాజెక్టులో రాజకీయ వేధింపుల కారణంగా ఓ అంగన్‌వాడీ వర్కర్‌ ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ రాష్ట్ర సహాయక కార్యదర్శి వేమేశ్వరి బాధితురాలిని పరామర్శించారు. కొన్నినెలలుగా బకాయిలు ఇవ్వకపోగా రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని ఆమె ఆరోపణ.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంగన్ వాడీ టీచర్ అజంతాబాయిని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఐద్వా సంఘం మహిళా నేతలు పరామర్శించారు. గత 5 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న అజంతాబాయిని తొలగించడం దారుణమన్నారు సునీత.

టీడీపీ మద్దతుదారులపై ఆర్దికదాడులకు అధికారపార్టీ తెగబడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లా కోడూరు పంచాయితీలో 70ఎకరాల చేపలు, రొయ్యల చెరువల్ని రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపినందునే రాజకీయ కక్షలకు దిగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఓవైపు ఉద్యోగులపై రాజకీయ ఒత్తిళ్లు, టీడీపీ నేతలపై దాడులు కొనసాగుతుండగా నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే పీఏ నంటూ మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సులో మధుసూదన్‌ అనే వ్యక్తి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ పీఏ అంటూ గొడవ చేశాడు. తోటి ప్రయాణీకులపై విరుచుకుపడ్డాడు. మా ప్రభుత్వం వచ్చిందని, తాను బస్సు ఎక్కగానే లేచి నిల్చొని సీటు ఇవ్వాలంటూ ఘర్షణ పడ్డాడు మధుసూదన్. కండక్టర్‌పైనా దాడి చేశాడు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి గూడూరులో మధుసూదన్‌ను పోలీసులకు అప్పగించారు.

వైసీపీ వేధింపుల ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఏమిటీ రాక్షస పాలనంటూ ఫైర్ అయ్యారు. ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో వైసీపీ కార్యకర్తలు చిన్న ఉద్యోగులనూ వేధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారాయన. ఈ ఘటనకు కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా టీడీపీ చూస్తూ ఊరుకోదని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

రాష్ట్రంలో రాజకీయ దాడులు పెరిగిపోతుండటంపై టీడీపీతోపాటు బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై స్పందించారు.. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆత్రం తప్ప అభివృద్ధి ఏమాత్రం కనిపించడంలేదని ఆయన విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story