ఆఫీస్‌‌లో పనిచేసే అమ్మాయితో సహజీవనం.. వద్దన్నందుకు హత్య

ఆఫీస్‌‌లో పనిచేసే అమ్మాయితో సహజీవనం.. వద్దన్నందుకు హత్య

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సతీష్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు . సతీష్‌ స్నేహితుడు హేమంత్‌ ఒక్కడే హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. సతీష్‌ వార్నింగ్‌ వల్ల తన ప్రేమ వ్యవహారంతో పాటు, వ్యాపార భాగస్వామ్యంలోనూ తేడా వస్తుందని హత్య చేసినట్టు హేమంత్‌ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

KPHB ఏడో ఫేజ్‌లో ఐటీ సంస్థ యజమాని సతీష్‌ బాబు హత్యకేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. హత్య జరిగాక హేమంత్‌ కనిపించకపోవడం, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండటంతో ఈకేసుతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానించారు. ఈ కేసులో నిందితుడు హేమంత్‌ది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. సతీష్‌ బాబు ప్రకాశం జిల్లా వాసి. ఇద్దరూ కోరుకొండ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. సతీష్‌ పదేళ్ల క్రితం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌ శిక్షణా సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఐటీ స్లేట్‌‌‌ కన్సల్టెన్సీ సంస్థను కొందరి పార్టనర్‌షిప్‌‌తో కలిసి నిర్వహిస్తున్నాడు.

2016లో హేమంత్‌ ఉద్యోగం కోసం సతీష్‌ వద్దకు వచ్చాడు. చిన్నప్పటి ఫ్రెండ్‌ కావడంతో తన కంపెనీ అడ్మిన్‌లో జాబ్‌ ఇచ్చాడు సతీష్‌. కంపెనీని కూకట్‌పల్లికి షిఫ్ట్‌ చేశాక హేమంత్‌ కూడా కొంత పెట్టుబడి పెట్టాడు. 2017లో విజయవాడకు చెందిన ఓ యువతి సతీష్‌ కంపెనీలో జాయిన్‌ అయింది. హేమంత్‌కు ఆ యువతికి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి హేమంత్‌కు అతడి భార్య విడాకులిచ్చింది.

భార్య వెళ్లిపోయాక హేమంత్‌ తన ప్రియురాలితో కలిసి KPHBలో సహజీవనం చేయసాగాడు. కంపెనీలో నష్టాలు రావడంతోపాటు హేమంత్‌ అక్రమసంబంధం వ్యవహారంపై సతీష్‌ సీరియస్‌ అయ్యాడు. ఆ అమ్మాయిని వదిలేయాలని సతీష్‌ వార్నింగ్ ఇచ్చాడు. వారం తర్వాత ఆ అమ్మాయిని వదిలేశావా లేదా అంటూ సతీష్‌ ఫోన్‌ చేశాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 28 రాత్రి పార్టీ చేసుకుందామని హేమంత్‌ ఇన్వైట్‌ చేశాడు. మద్యం తాగాక ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి సతీష్‌ తలపై బలంగా సుత్తితో కొట్టి చంపాడు హేమంత్‌.

ఆగస్టు 29న సతీష్‌ భార్య ప్రశాంతి తన భర్త కనబడటంలేదని మిస్సింగ్‌ కేసు పెట్టారు. దీంతో ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌లో సతీష్‌ స్నేహితుడు హేమంత్‌పై అనుమానం వచ్చింది. హేమంత్‌ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. తాళం పగులగొట్టి చూడగా సతీష్‌ బాడీ హేమంత్‌ ఇంట్లో ఉందన్నారు డీసీపీ. కట్టింగ్‌ మెషిన్‌తో శరీరాన్ని ముక్కలుగా కోసేందుకు ప్రయత్నించాడు. అది సాధ్యం కాలేదు. బాడీని బయటికి తీసుకెళ్లడంలోనూ విఫలమవడంతో డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచేశాడు. హత్య చేశాక రాత్రి 3 గంటల సమయంలో BHELలోని సమీప బంధువు ఇంటికి వెళ్లిన హేమంత్‌ ఆ తర్వాత కర్ణాటక వెళ్లిపోయాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుల్బర్గాలో ఉన్న హేమంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టగా విషయాలన్నీ బయటికొచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story