నేడు గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర.. హైదరాబాద్ లో..

నేడు గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర.. హైదరాబాద్ లో..

భాగ్యనగరంలో ఈసారి వినాయక నిమజ్జనోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. నగరంలో మొత్తం 8 ప్రధాన మార్గాల్లో నిమజ్జనానికి గణనాథులను తరలించేలా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. రాచకొండ, బాలాపూర్‌ నుంచి ప్రధాన ర్యాలీ ప్రారంభమవుతుంది.. ట్యాంక్‌ బండ్‌ వరకు 18 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ రూట్‌లోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 17 ప్రధాన ర్యాలీలు కలుస్తాయి.. మూడు కమిషనరేట్ల పరిధిలో శోభాయాత్ర 391 కిలోమీటర్లు జరుగుతుంది.. ఈ నేపథ్యంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పున 194 యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక కెమెరాల ద్వారా అనుక్షణం ప్రత్యక్ష వీక్షణం చేయనున్నారు పోలీసులు.

మొదటి మార్గం కట్టమైసమ్మ టెంపుల్‌ దగ్గర మొదలై ట్యాంక్‌ బండ్‌ దగ్గర ఎండ్‌ అవుతుంది.. కట్టమైసమ్మ ఆలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా క్రాస్‌ రోడ్‌, అలియాబాద్‌, లాల్‌ దర్వాజ, చార్మినార్‌, మదీనా మీదుగా సాగుతుంది.. అక్కడ్నుంచి అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌, లిబర్టీ మీదుగా ట్యాంక్‌ బండ్‌కు గణనాథులు చేరుకుంటారు.

రెండో మార్గంలో వినాయకుడి శోభాయాత్ర ఉప్పల్‌ నుంచి మొదలవుతుంది.. అక్కడ్నుంచి ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, రామంతాపూర్‌, అంబర్‌పేట, ఛే నంబర్‌, నింబోలి అడ్డా, చాదర్‌ఘాట్‌, పుత్లిబౌలి మీదుగా ఎంజే మార్కెట్‌ దగ్గర కలుస్తుంది.. శోభాయాత్ర నేపథ్యంలో.. ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

మూడో మార్గంలో ఎల్బీనగర్‌ నుంచి శోభాయాత్ర మొదలవుతుంది. ఎల్బీనగర్‌ నుంచి కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, నల్గొండ చౌరస్తా, చాదర్‌ఘాట్‌, పుత్లిబౌలి మీదుగా ఎంజే మార్కెట్‌ దగ్గర కలుస్తుంది.. అక్కడ్నుంచి గణనాథులను ట్యాంక్‌ బండ్‌కు తరలిస్తారు. రూట్‌ నంబర్‌ 4 ఎర్రగడ్డ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు కొనసాగుతుంది.. ఎర్రగడ్డ నుంచి గణనాథులు అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, నిరంకారీ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు తరలిస్తారు.. అక్కడ నిమజ్జనం చేస్తారు.

ఇక శోభాయాత్ర ఐదో మార్గం మెహదీపట్నం నుంచి మొదలవుతుంది.. అక్కడ్నుంచి మాసబ్‌ ట్యాంక్‌, అయోధ్య జంక్షన్‌, నిరంకారీ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు కొనసాగుతుంది.. రూట్‌ నంబర్‌ 6 చిలకగూడ నుంచి ట్యాంక్‌ బండ్‌ వరకు పోలీసులు నిర్దేశించారు.. చిలకగూడ నుంచి తరలివచ్చే గణనాథులను అక్కడ్నుంచి గాంధీ ఆస్పత్రి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ మీదుగా ట్యాంక్‌ బండ్‌కు తరలించాల్సి ఉంటుంది.

ఏడో మార్గంలో శోభాయాత్ర బేగంపేట నుంచి ట్యాంక్‌ బండ్‌ వరకు జరుగుతుంది. బేగంపేట నుంచి రసూల్‌పురా, మినిస్టర్స్‌ రోడ్‌, జేమ్స్‌ స్ట్రీట్‌, బుద్ధ భవన్‌ అక్కడ్నుంచి ట్యాంక్‌ బండ్‌కు వినాయక విగ్రహాలను తరలించి నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. చివరిగా రూట్‌ నంబర్‌ 8 మారేడ్‌ పల్లి నుంచి వైఎంసీఏ, ప్యాట్నీ సెంటర్‌, జేమ్స్‌ స్ట్రీట్‌, బుద్ధ భవన్‌ మీదుగా ట్యాంక్‌ బండ్‌ వరకు కొనసాగుతుంది. అయితే, అన్ని విగ్రహాలను ట్యాంక్‌ బండ్‌కు తరలించడకుండా ఎక్కడి విగ్రహాలను అక్కడే సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేయాలని పోలీసులు మంటపాల నిర్వాహకులకు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు వినాయక విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story