తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌!

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌!

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతోంది. ఇప్పటికే నాలుగు యూనియన్లు నోటీసులు ఇవ్వగా... ఇప్పుడు ప్రభుత్వ గుర్తింపు పొందిన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ సైతం నోటీసులు ఇచ్చింది. ఈనెల 25 తర్వాత ఏ క్షణమైనా సమ్మె చేస్తామన్నారు మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మకు టీఎంయూ నేతలు నోటీసులు ఇచ్చారు..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆయన మాట తప్పారంటూ విమర్శించారు నేతలు. ఆర్టీసీ విలీనంతో పాటు ఐఆర్‌, డీఆర్‌ వెంటనే ప్రకటించాలని, ఐదు వేల కోట్లకుపైగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాలన్నారు. కొత్త ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, దీంతో ఉన్నవారిపై పనిభారం పడుతుందన్నారు. కార్మికుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు... సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు..

మజ్ధూర్‌ యూనియన్‌ సమ్మె నోటీసుతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కార్మికుల సమస్యను పరిగణలోకి తీసుకుంటామన్నారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌. ఈ మేరకు ఆయన అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతోనూ సమావేశయ్యారు. కార్మికుల సమస్యలు, డిమాండ్లను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి పువ్వాడ అజయ్.

ఇప్పటికే నాలుగు కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఇప్పుడు మజ్ధూర్‌ యూనియన్‌ సైతం సమ్మె నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయితే సమ్మె జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story