మిస్టరీగా మారిన ఫ్యామిలీ మిస్సింగ్ కేసు

మిస్టరీగా మారిన ఫ్యామిలీ మిస్సింగ్ కేసు

కడప జిల్లాలో ఓ కుటుంబ అదృశ్యం కలకలం రేపుతోంది. రాజుపాలెం మండలం గాదెగూడూరులో తిరుపతిరెడ్డి.. అతడి భార్య వెంకటలక్ష్మి, కూతురు ప్రవళిక ముగ్గురూ అదృశ్యం మిస్టరీగా మారింది. అయితే వీరి ముగ్గురూ నిజంగా అదృశ్యమయ్యారా..? నదిలో కొట్టుకుపోయారా..? లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్నది తెలియక పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

కడప జిల్లా రాజుపాలెం మండలం గాదెగూడూరు గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మిస్టరీగా మారింది. తిరుపతి రెడ్డి బంధువులు మాత్రం.. వాళ్లంతా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇటీవల తరుచూ గొడవలు అవుతున్నట్టు చెబుతున్నారు. తిరుపతి రెడ్డి కూతురు ప్రవళిక అదే గ్రామానికి చెందిన బాల ఓబుల్‌రెడ్డితో ప్రేమలో పడింది. కానీ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ప్రియుడితో కలిసి పారిపోయి వివాహం చేసుకుంది ప్రవళిక. ఈ విషయం తెలిసి పెద్దమనుషులు పంచాయతీ పెట్టి.. ఆమెను మందలించి తల్లిదండ్రులతో పంపించారు. కూతురు తమ చెంతకు చేరిందనే సంతోషం కంటే.. కూతురు తమ పరువు తీసిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు తిరుపతి రెడ్డి దంపతులు. నాలుగు రోజులపాటు మనోవేదనకు గురయ్యారు. ముగ్గురూ కలిసి అర్ధరాత్రి బైకుపై బయలు దేరారు. ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు. వారి కోసం వెతికిన బంధువులకు.. తిరుపతి రెడ్డి బైకు కుందూనది బ్రిడ్జిపై కనిపించింది. దీంతో అంతా కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.

అత్తమామలు, భార్య కనిపించడం లేదంటూ ప్రవళిక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ మిస్సింగ్ మిస్టరీపై ఇంకా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. వాగులో గాలింపు చర్యలు చేపట్టడానికి సాధ్యం కావడం లేదు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కుందూనది ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరుపతిరెడ్డి, అతడి భార్య, కూతురు నదీ ప్రవాహానికి కొట్టుకుపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? నది ప్రవాహానికి కొట్టుకుపోతే బైకు కూడా వాగులో పడిపోవాలి కదా! ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వాగులో వరద తీవ్రత తగ్గిన తర్వాత గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పటిదాకా మిస్సింగ్ కేసుగానే భావిస్తామని చెప్పారు. ప్రేమ వ్యవహారమే కుటుంబాన్ని బలితీసుకుందా? లేక అవమానం భరించలేక ఎక్కడికైనా వెళ్లిపోయారా అనేది మిస్టరీగా మారింది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story