ఆవిరైన ఆశలు.. బోటు బయటికి తీయలేక చేతులెత్తేసిన అధికారులు

ఆవిరైన ఆశలు.. బోటు బయటికి తీయలేక చేతులెత్తేసిన అధికారులు

గోదావరిలో రాయల్ వశిష్ట బోటు మునిగిపోయి ఆరు రోజులు అవుతోంది. ఇక బోటును పైకి తీస్తారనే ఆశలు ఆవిరయిపోతున్నాయి. గోదావరి నదీ గర్భంలోని 250 అడుగుల లోతులో ఉన్న బోటును వెలికితీసే పనుల్లో అధికారులు ఇప్పటికే చేతులెత్తేశారు. ముఖ్యంగా అధికారుల్లో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనపడుతోంది.

నేవీ బృందాలు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, ఉత్తరాఖండ్‌ విపత్తుల శాఖ, ముంబై మెరైన్‌ మాస్టర్స్ వివిధ అంచనాలతో సైడ్‌ స్కానర్‌ సోనార్‌ పరికరంతో మునిగిపోయిన బోటు ఏ ప్రాంతంలో ఉందో అంచనాకు వచ్చారు. దాదాపు 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు కొనుగొన్నారు. బోటును వెలికితీసేందుకు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం, ముంబై మెరైన్‌ మాస్టర్స్‌, ఉత్తరాఖండ్ విపత్తుల శాఖ సిబ్బంది సహాయంతో బోటును వెలికితీస్తామని బోటు మునిగిన నాలుగు రోజులకు ప్రకటించారు. అయితే నేటికి ఆరు రోజులు గడుస్తున్నా బోటు వెలికి తీయడంలో అన్ని శాఖలు చేతులు ఎత్తేస్తున్నాయి.

క్షణక్షణానికి ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఉండడంతో స్థానిక మత్స్యకారులు కూడా తమ వంతు సాయం చేసేందుకు సిద్ధమంటున్నారు. చిన్నప్పటి నుంచి గోదావరినే నమ్ముకుని బతుకుతున్న తమకు ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో బాగా తెలుసని.. సాయం చేస్తామని చెప్తున్నారు. సుడిగుండాలను చూసి ప్రభుత్వ బృందాలు భయపడుతున్నాయని, తాము స్థానికులం కాబట్టి ప్రతిదానిపై అవగాహన ఉందని అవకాశం ఇస్తే బోటు బయటకు తీస్తామని అంటున్నారు.

స్థానికులు ధైర్యం చేస్తామంటున్నా అధికారులు అందుకు సహకరించడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలో మీడియాపైనా విపరీతమైన ఆంక్షలు విధించారు. కచ్చులూరు, మంటూరు తరదిత ప్రాంతాల్లో అనధికార 144 సెక్షన్‌ విధించి బోటు మునిగిన ఘటనా ప్రాంతానికిగాని, దేవీపట్నం ప్రాంతానికి కాని రానివ్వకుండా ఆంక్షలు విధించారు. అయితే ఇప్పటికి 35 మృతదేహాలు బయటకు తీశారు. మిగతా 12 మంది ఆచూకీ దొరుకుతుందో లేదో చెప్పలేకపోతున్నారు. పడవనుపైకి తీస్తే అందులో కొన్ని మృతదేహాలు ఉండొచ్చంటున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story