ఆ ప్రమాదం ఉంది : బోటు బాధిత కుటుంబాలు

ఆ ప్రమాదం ఉంది : బోటు బాధిత కుటుంబాలు

ఆశలు ఆవీరి అవుతున్నాయి.. గోదావరిలో బోటు ప్రమాదం జరిగి తొమ్మిది రోజులు అవుతున్నా.. విషాద ఘోష ఇంకా మార్మోగుతూనే ఉంది. గత ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగితే.. ఇవాళ్టికి 38 మంది మృత దేహాలను వెలికి తీశారు. ఇంకా 14 మంది జాడ తెలియాల్సి ఉంది. గత ఆదివారం మధ్యాహ్నం 77 మందితో వెళ్తున్న పడవ మునిగిపోతే.. ఇంకా మృతదేహాల వెలికితీత పూర్తికాలేదు. నిన్న ఉదయం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండల పరిధిలోని కొత్తూరు ప్రాంతంలోని గోదావరిలో ఓ మహిల మృతదేహం లభ్యమయింది. సాయంత్రం జిల్లాలోని ఐ.పోలవరం మండలం ఎదుర్లంక ప్రాంతంలో పురుషుని మృతదేహం వెలుగు చూసింది ఈ రెండు ఎవరివన్నది గుర్తించాల్సి ఉంది. మహిళ మృతదేహాన్ని బాధిత కుటుంభీకులు గుర్తించలేకపోయారు దీంతో ఈ ప్రమాదానికి సంబంధించిందా..? కాదా..? అనే సంశయం నెలకొంది.

ప్రస్తుతం కచ్చులూరు దగ్గర గాలింపు నిలిపేయడంతో పడవలన్నీ ఒడ్డుకు చేరాయి. అధికారులు మాత్రం మునిగిన బోటు పైకి తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటున్నారు. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. బోటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో వెలికి తీసే చర్యల్లో ఎలాంటి కదలిక కనిపించడం లేదు. భారీ క్రేను సాయంతో ఇనుప తీగలు, కొక్కేలను ఉపయోగించి బోటు వెలికితీస్తారనే ప్రచారం సాగింది. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపించడం లేదు. భారీ వాహనంతో ప్రమాద స్థలానికి చేరుకోవాలి అంటే కనీసం 5 కిలోమీటర్ల పొడవున అనువైన వాతావరణం ఉండాలి.. ప్రస్తుతం గోదావరి వదర ఉధృతి కూడా అధికంగానే ఉంది. నిన్నటికే ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి నీటిమట్టం 10.80 అడుగులు ఉండగా.. 3.69 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బోటు మునిగిన ప్రాంతంలోల మూడు రకాల సుడిగుండాలు ఉన్నాయని, అక్కడికి చేరుకోవడం కష్టమని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యల్లో జాప్యంపై బాధితులు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం బోటు వెలికితీతకు ఉపక్రమించే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. కొద్ది మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ ఇతర సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు.. మిగిలివారంతా ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయారు. మరోవైపు ఉన్నతాధికారుల జాడ లేకపోవడంతో చర్యలు ఎప్పుడు ఊపదందుకుంటాయన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. వెలికి తీతలో జాప్యం జరుగుతున్న కొద్దీ మృతదేహాల ఆచూకీ గుర్తుపట్టలేనట్టు తయారయ్యే ప్రమాదం ఉందన్న వాదన బాధిత కుటుంబాల నుంచి వినిపిస్తోంది. జన్యు పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియ చేపట్టడం మినహా ప్రత్యామ్నాయం లేదని కొందరు అంటున్నారు.

ఆచూకీ గల్లంతైన తమవారి కోసం తొమ్మిది రోజులు బాధిత కుటుంబ సభ్యులు ఎదురుచూపులు చూస్తున్నారు. నిరీక్షించి, నీరసించి, అసహనానినికి గురవుతున్నారు. వీరంతా తమకు న్యాయం జరగడం లేదని.. బోటు వెలికితీతలో ప్రభుత్వ శ్రద్ధచూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం దాటినా బోటు వెలికి తీయకపోవడంతో బాధిత కుటుంబాల్లో అంతులేని ఆవేదన కనిపిస్తోంది.

కచ్చులూరు ప్రమాదంలో మునిగిపోయిన లాంచీని బయటికి తీసేందుకు చాలా తక్కువగా అవకాశాలున్నాయన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. కేంద్రం నుంచి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించి బోటు తీసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని అధికారుల్ని కోరినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story