డెలివరీ బాయ్ జీవితాన్ని మార్చేసిన ఓ ఐడియా..

డెలివరీ బాయ్ జీవితాన్ని మార్చేసిన ఓ ఐడియా..

చదువుకోవాలని వున్నా చదివించే పరిస్థితిలో లేని నాన్న. ఆర్థిక పరిస్థితి అనుకూలించక పదో తరగతిలోనే చదువు మానేయమన్నాడు తండ్రి. తమతో పాటు పనికి రమ్మన్నారు అమ్మానాన్న. కూలికి వెళ్తే సంపాదన అంతంత మాత్రమే అని అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా చేరాడు రఘువీర్. జైపూర్‌కి చెందిన రఘువీర్‌కి అమ్మా నాన్న, చెల్లి తమ్ముడు ఉన్నారు. అమ్మా నాన్న వ్యవసాయ కూలీలు. తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ భారం రఘువీర్‌పై పడింది. డెలివరీ బాయ్‌గా 9వేల జీతానికి కుదిరాడు. ఆర్డర్ అందజేయడానికి అతడి దగ్గర బైక్ కూడా లేదు. సైకిల్ మీదే వెళ్లి ఇచ్చేవాడు.

ఈ క్రమంలో డెలివరీ లేటయితే కస్టమర్లు కోపగించుకుంటారని టైమ్‌కి ఆహారం కూడా తీసుకునే వాడు కాదు. టీ తాగి సరిపెట్టుకునే వాడు. అదే సమయంలో దగ్గర్లో సరైన టీ స్టాల్స్ లేకపోవడాన్ని గుర్తించాడు. రఘువీర్ ఫుడ్ డెలివరీ చేస్తుంటే కొంత మంది కస్టమర్లు కాస్త, టీ స్నాక్స్ తెచ్చి పెట్టు డబ్బులు ఇస్తాము అనే వారు. చుట్టు పక్కల మంచి హోటల్స్ ఏవున్నాయో చూసుకుని వారి దగ్గర టీ, సమోసా తీసుకుని వెళ్లి అడిగిన వారికి ఇచ్చేవాడు. అలా టీ స్నాక్స్ తీసుకురమ్మనే కస్టమర్ల సంఖ్య కూడా పెరిగింది. తన ఆదాయమూ పెరిగింది.

ఆ డబ్బులతో ముందు బండి కొనుక్కున్నాడు. కొన్ని రోజులకు తనే ఓ టీ స్టాల్ ఎందుకు పెట్టకూడదు అని ఆలోచించాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి టీ స్టాల్ ఏర్పాటు చేసాడు. మినరల్ వాటర్‌ ఉపయోగించి మంచి రుచికరమైన టీని, దాంతో పాటు వేడి వేడి సమోసాని కస్టమర్లకు అందించేవాడు. ఆర్డర్‌లన్నీ ఫోన్, వాట్సాప్‌ల ద్వారా వచ్చేవి. మొదట్లో రోజుకి వంద వున్న కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 500ల నుంచి 800లకు పెరిగింది. రఘువీర్ నెల సంపాదన లక్షరూపాయలకు చేరుకుంది. నాన్నకి మంచి వైద్యం చేయించాడు.

అమ్మని కూలి పని మాన్పించాడు. చెల్లి తమ్ముడిని చదివిస్తున్నాడు. ప్రస్తుతం ఆరుగురు డెలివరీ బాయ్స్‌ని, పదిమంది వర్కర్స్‌ని పెట్టుకుని టీస్టాల్ రన్ చేస్తున్నాడు. జైపూర్‌లోని రద్దీ ప్రాంతాల్లో మరో మూడు టీ స్టాళ్లను ఏర్పాటు చేసి బిజినెస్‌ని విస్తరించుకున్నాడు. సమస్య వచ్చినప్పుడు కృంగి పోకుండా ఆలోచిస్తే పరిష్కారమూ దొరుకుతుందనడానికి రఘువీర్ జీవితమే నిదర్శనం.

Tags

Read MoreRead Less
Next Story