74 ఏళ్ల బామ్మకు ఐవీఎఫ్‌పై విమర్శలు .. అహల్యా హాస్పిటల్‌‌ సంచలన నిర్ణయం

74 ఏళ్ల బామ్మకు ఐవీఎఫ్‌పై విమర్శలు .. అహల్యా హాస్పిటల్‌‌ సంచలన నిర్ణయం

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలిగానీ.. ఇదేం చిత్రమండీ బాబు.. ఇప్పుడు పిల్లల్ని కనడం ఏమిటి.. అసలు ఎవరండీ ఆ డాక్టరు. సైన్సు అభివృద్ధి చెందిందని ప్రయోగాలు చేస్తారా అంటూ చాలా మందే 74 ఏళ్ల బామ్మ కవలలకు జన్మనివ్వడం గురించి మెటికలు విరిచారు. ఆ వయసులో సంచలనమే కావచ్చు. కానీ ఆచరణలో ఎంత కష్టం. ఒకరి మీద ఆధారపడే వయసులో బిడ్డల్ని కనడం అంటే మాటలు కాదు. కనీసం 50 ఏళ్ల లోపన్నా కాదు అని చాలా మంది చెవులు కొరుక్కున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై సీరియస్ అయ్యాయి పలు వైద్య సంఘాలు సైతం.

అసిస్టెంట్ రీప్రొడెక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) బిల్లు-2017 ప్రకారం 18 ఏళ్లలోపు.. 45 ఏళ్ల పైబడిన వారికి ఈ చికిత్స అందించడం నిషేధం అని పేర్కొన్నారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రీ ప్రొడక్షన్, ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ రీప్రొడక్షన్ తదితర సంఘాల అధ్యక్షులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 74 ఏళ్ల మంగాయమ్మకు చికిత్స అందించిన గుంటూరులోని అహల్య ఐవీఎఫ్ సెంటర్ ఆదివారం తన నోటీసు బోర్డులో పేర్కొన్న వివరాలు చర్చనీయాంశమయ్యాయి. ఇకపై ఐవీఎఫ్‌ విధానం ద్వారా 45 ఏళ్లు పైబడిన భార్య, 50 ఏళ్లు పైబడిన భర్తలను ట్రీట్‌మెంట్‌కి తీసుకోబోమని.. సెప్టెంబర్ 2019 నుంచి ఈ రూల్స్ కచ్చితంగా పాటిస్తామని పేర్కొంది. ఏఆర్‌టీ బిల్లు ప్రకారమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అందులో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story