లంక గ్రామాల్లో గోదావరి విలయతాండవం

లంక గ్రామాల్లో గోదావరి విలయతాండవం

లంక గ్రామాల్లో గోదావరి విలయతాండవం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు వరద ముంపులోనే కొట్టిమిట్టాడుతున్నాయి. గత రెండు నెలల్లో గోదావరికి వరద పోటెత్తడం ఇది ఐదోసారి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయినవిల్లి లంకలో కాజ్‌వేపైకి వరద చేరింది. దీంతో వీరవల్లిపాలెం, అద్దంకివారిలంక, పల్లపులంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టూ నీరు చేరడంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అత్యసర పరిస్థితుల్లో జనం నాటుపడవల్ని ఆశ్రయిస్తున్నారు.

ఏజెన్సీ ఏరియా కూనవరం వద్ద శబరి, గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని లంక గ్రామాల్లో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గురజాపులంక, ఠాణేలంక, కూనాలంక, గేదెళ్లంక, చింతపల్లిలంక, చింతవానిరేవు, పోగాకులంక, గ్రామాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది.

వరద ఉద్ధృతితో తూర్పు ఏజెన్సీ ప్రాంతాలైన దేవీపట్నం, చింతూరు తదితర ప్రాంతాల్లోని 15 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరి, వంగ, బెండ, అనప, పచ్చిమిర్చి దొండ, టమాటా, మునగ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పశుగ్రాసానికి కూడా కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు విద్యార్థులు కూడా పాఠశాలలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story