మరోసారి ఉప్పొంగిన గోదారి.. పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ

మరోసారి ఉప్పొంగిన గోదారి.. పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి గోదావరి, కృష్ణా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. దీంతో గోదావరి నది వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి పోటెత్తింది. పుష్కర ఘాట్లను తాకుతూ 11.20 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం.. మేడిగడ్డ వైపు ప్రవహిస్తోంది. దీంతో గోదావరి తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌ జలకళను సంతరించుకుంది. 82 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ ఫ్లో 12.63 లక్షలు, ఔట్‌ ఫ్లో 12.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

మేడిగడ్డ బ్యారేజ్‌ గేట్లను ఎత్తివేయడంతో... పంకేన గ్రామ సమీపంలో సుమారు 15 వందల గొర్రెలు , నలుగురు గొర్రెల కాపర్లు వరదలో చిక్కుకున్నారు. వారిని స్థానికులు కాపాడారు.

అటు... భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహంపై జిల్లా కలెక్టర్‌... అధికారులను అప్రమత్తం చేశారు.

ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లంక గ్రామాలు నీట మునిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక కాజ్‌వేపై వరద భారీగా ప్రవహిస్తోంది. కోనసీమలోని వైనతేయ, వశిష్ట, గౌతమి నదులకు వరద తాకిడి పెరిగింది.

పశ్చిమగోదావరి జిల్లాలోని విలీన మండలాలను మరోసారి వరదలు ముంచెత్తాయి. ఓవైపు గోదావరి, మరోవైపు శబరి నది వరద తాకిడితో విలీన మండలాలకు వరద పోటెత్తింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు నీట మునిగాయి.

అటు కృష్ణమ్మ సైతం పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్‌, ఉజ్జయిని, జూరాల, తుంగభద్ర ప్రాజెక్ట్‌ల్లో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ వరదనీటిని దిగువకు వదులుతున్నారు..

అటు శ్రీశైలం డ్యాంకు లక్షా 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. దీంతో 98 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీ శైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. పులిచింతల నుంచి 36 వేల క్యూసెక్కులు నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద 15 గేట్లు ఒక అడుగు మేర ఎత్తారు. దాదాపు 11వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.. మొత్తానికి అటు గోదావరి, ఇటు కృష్ణమ్మలు పరవళ్లు తొక్కుతుండటంతో.. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వరద పరిస్థితి తలెత్తుతోంది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story