పునరావాస కాలనీలను వేధిస్తున్న ఇసుక కొరత

పునరావాస కాలనీలను వేధిస్తున్న ఇసుక కొరత

పోలవరం జాతీయ ప్రాజెక్ట్ పనులతో పాటు పునరావాస గృహాల నిర్మాణాలనూ ఇంకా గ్రహణం వీడలేదు. వరద ముంపుతో పాటు.. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోతే, ఇసుక కొరతతో పునరావాస కాలనీలు నిలిచిపోయాయి. 2020 మార్చి కల్లా పునరావాస కాలనీలు పూర్తిచేస్తామంటున్న ప్రభుత్వం మాటలు ఆచరణాత్మకంగా లేవు.

పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఆవాసాలు కోల్పోతున్న లక్షా 5 వేల కుటుంబాలకు నిర్మించాల్సిన పునరావాస కాలనీలు 100 రోజుల నుండి ఇసుకతో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. గిరిజనులకు పోలవరం మండలంలోని ఎల్.ఎన్.డి.. పేటలో, గిరిజనేతరులకు గోపాలపురం మండలం సాగిపాడు గ్రామంలో పునరావాస కాలనీల నిర్మాణం తలపెట్టారు. మరోవైపు విలీనమండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గిరిజనులకు బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు మండలాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. గిరిజనేతరులకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో నిర్మిస్తున్నారు. మొత్తం జిల్లాలోని మూడు మండలాల్లో ఉన్న 28వేల నిర్వాసిత కుటుంబాల కోసం తలపెట్టిన పునరావాస కాలనీల పనులు ముందుకుసాగడం లేదు. నిర్వాసిత కాలనీల్లో 10 శాతం ఇళ్లు మాత్రమే దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. ఇంకా 80 శాతం ఇళ్లు పునాది దశలోనే ఉన్నాయి.

పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో వ్యవసాయ భూమి ఎకరాకు రూ.5 లక్షలు పరిహారం ఇస్తామని హామీ ఇవ్వగా, దానితో పాటు ప్రధానంగా 18 ఏళ్లు నిండిన యువతను కుటుంబంగా భావించి, వారికి కూడా ఆరున్నర లక్షల రూపాయాల నుంచి రూ. 10 లక్షల వరకూ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇంటి నిర్మాణానికి గిరిజనులకు రూ. 3లక్షల 60 వేలు, గిరిజనేతరులకు 3 లక్షల రూపాయల వరకు అందిస్తున్నారు. అయితే ఇచ్చిన డబ్బులు సరిపోవడం లేదు. పైగా ఇసుక కొరత కారణంగా జాప్యం జరిగి.. నిర్వాసితులపై భారం పడుతోంది.

వచ్చే ఏడాది మార్చికల్లా పునరావాస కాలనీలు పూర్తిచేస్తామని కొత్త ప్రభుత్వం చెప్పిన మాటలు అమలయ్యే పరిస్థితి లేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ పేరుతో పునరావాస కాలనీలకు కూడా సరఫరా నిలిపివేయడంతో 100 రోజులుగా ఇసుక సరఫరా లేక ఇప్పటికే జరిగిన పునాది, పిల్లర్ల నిర్మాణాలు కూడా భారీ వర్షాలకు తడిసి ముద్దయి సిమెంట్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఇసుక ఉంటే ఈపాటికి నిర్మాణాలు పూర్తయ్యేవని, ఇప్పటికైనా నూతన ఇసుక పాలసీలో పోలవరం పునరావాస నిర్మాణాలకు ప్రత్యేకంగా ఇసుక ర్యాంపులు, ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయాలని నిర్వాసిత కుటుంబాలు, నిర్మాణ గుత్తేదారులు కోరుతున్నారు.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story