పల్నాడులో ఉద్రిక్తత.. గృహనిర్బంధంలో టీడీపీ నేతలు

పల్నాడులో ఉద్రిక్తత.. గృహనిర్బంధంలో టీడీపీ నేతలు

పల్నాడులో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ప్రకటనలతో యుద్ద వాతావరణం తలపిస్తోంది. ఛలో ఆత్మకూరుకు టీడీపీ పిలుపునివ్వడంతో పోటీగా వైసీపీ శ్రేణులు కూడా ఛలో ఆత్మకూరు అంటూ నినాదం అందుకున్నారు. దీంతో పల్నాడులో ఉద్రిక్తత నెలకొంది.

అటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచుతున్నారు. నిన్న రాత్రి నుంచే చంద్రబాబు సహా పలువురు నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. బయటకు రాకుండా వారిని అడ్డుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆత్మకూరు చేరుకుంటున్న టీడీపీ కార్యకర్తల వాహనాలను కూడా ఎక్కడిక్కడ అడ్డుకుని వెనక్కు పంపుతున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఎక్కడిక్కడ ధర్నాలకు దిగారు. పోలీసుల తీరునకు నిరసనగా గ్రామాలు నినాదాలతో మార్మోగాయి.

మరోవైపు టీడీపీకి పోటీగా ఛలో ఆత్మకూరుకు సిద్ధమైంది వైసీపీ. టీడీపీ బాధితులతో తాము కూడా ఆత్మకూరు వెళ్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఛలో ఆత్మకూరు పేరుతో పల్నాడులో టీడీపీ ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ.

ఛలో ఆత్మకూరును అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసుల్ని మోహరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి కార్యక్రమాలను అనుమతించబోమంటున్నారు పోలీసులు. ఓ వైపు 144 సెక్షన్‌, మరోవైపు ముందస్తు అరెస్టులు చేస్తుండటంతో పల్నాడులో ప్రస్తుతం టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు. అటు.. టీడీపీ శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాధితులకు తాము అండగా నిలబడతామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

శిబిరం నుంచి బాధితుల్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు బాధితులు ఒప్పుకోవడం లేదు. దాడులు జరగవన్న భరోసా ఇస్తేనే స్వగ్రామాలకు వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి పల్నాడు యుద్ధం ఏపీ పాలిటిక్స్‌లో కాక రేపుతోంది. జిల్లా ఎస్పీ దాదాపు రాత్రి ఒంటిగంట వరకూ అక్కడే ఉండి.. శిబిరం నుంచి బాధితులను పంపించే ప్రయత్నం చేశారు. అయినా వారు కదల్లేదు. దీంతో శిబిరంలోకి నాయకులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story