ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడివేడి వాదనలు

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాది రామచందర్‌ రావు, కార్మిక సంఘాల జేఏసీ తరఫున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. అటు ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్ల వైఖరితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అదనపుచార్జీలు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పాస్‌లున్నవారికి కూడా టిక్కెట్లు ఇస్తున్నారని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వ నివేదిక అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.

సమ్మె ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై కార్మిక సంఘాలు కోర్టుకు వివరణ ఇచ్చాయి. ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని...న్యాయమైన డిమాండ్లను పరిష్కారానికే సమ్మె బాట పట్టామని చెప్పారు. నెల రోజుల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.జీత భత్యాలు, ఇతరత్రా అంశాలను పరిష్కరించాలని కోరినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. డిమాండ్లను పరిష్కరిస్తే.. వెంటనే సమ్మె విరమిస్తారని కోర్టుకు తెలిపారు.

సమ్మె నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని కానీ సంప్రదింపులు జరిపేందుకు సమయం ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ తరపు న్యాయవాది రామచందర్‌ రావు. సమస్యల పరిష్కారానికి గత నెల 29న సునీల్ శర్మ ఆధ్వర్యంలో కమిటీ నియమించామని చెప్పారు. ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే..కార్మికులు సమ్మెలోకి వెళ్లారన్నారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు తెలిపారు.

సమ్మెను ఉధృతం చేసే దిశగా ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమైన జేఏసీ నేతలు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఎన్ని ఇబ్బందులెదురైనా సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు..శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల నేతలను కలవడంతో పాటు ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.. అలాగే ప్రతి డిపో ముందు మౌన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈనెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్‌కు అన్ని పార్టీలు మద్దుతు ఇవ్వాలని కోరారు ఆర్టీసీ జేఏసీ నేతలు. సమ్మెపై ఆర్టీసీ సంఘాలు పట్టువీడటం లేదు. ఇటు ప్రభుత్వమూ మెట్టుదిగడం లేదు. దీంతో సమ్మెకు ఇప్పట్లో పరిష్కారం లభించే అవకాశం కనిపించడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story