జగన్, చిరు భేటీ అందుకేనా..? బంధువు వైసీపీలోకా?

జగన్, చిరు భేటీ అందుకేనా..? బంధువు వైసీపీలోకా?

చరిత్ర మెగాస్టార్‌తో మొదలైంది. ఒకసారికాదు.. రెండుసార్లు కాదు.. వందల సార్లు.. టాలీవుడ్ లోనూ, తెలుగు పాలిటిక్స్ లోనూ చిరు పాత్ర ఎప్పుడూ ప్రత్యేకమే. అదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు జరగబోయే మీటింగ్ ఏం చరిత్ర క్రియేట్ చేస్తుందోనన్న ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 14న అంటే సోమవారం చిరంజీవి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లనున్నారు. కుమారుడు, సైరా ప్రొడ్యూసర్ అయిన రాంచరణ్ తో కలిసి సీఎంను కలుస్తున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా వెంట ఉంటారు. "సైరా" మూవీని చూడాల్సిందిగా జగన్‌ను ఆహ్వానిస్తారు చిరంజీవి. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అనే చెప్తున్నారు. జగన్ కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించి సినిమా చూసేందుకు ఓ డేట్ ఫిక్స్ చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. సరేలే ఇది సినిమాకు సంబంధించిన మర్యాదపూర్వక భేటీయేనని ఎంత సర్దిచెప్పుకుందానుకున్నా ఫ్యాన్స్‌కి ఎక్కడో చిన్న అనుమానం మిగిలిపోతోంది. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం.

దసరాకి రిలీజైన సైరా సినిమాకు ఏపీ, తెలంగాణల్లో ప్రత్యేక షోలు వేసుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. 5 భాషల్లో 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కాబట్టి కలెక్షన్లు వసూలు చేయాలంటే ఆ మాత్రం ప్రోత్సాహం అవసరం కూడా. సీమలో తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో తెరకెక్కిన మూవీ కాబట్టి వినోద పన్ను కూడా మినహాయింపు వస్తుందని అంటున్నారు. జగన్- చిరంజీవి భేటీ తర్వాత దీనిపై ప్రకటన రావొచ్చు. గతంలో బాలయ్య శాతకర్ణి సినిమాకు చంద్రబాబు ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చినట్టే ఇప్పుడూ చేస్తారంటున్నారు. పైగా.. చిరంజివి అంతటివాడే స్వయంగా ఇంటికి వచ్చి మూవీ చూడ్డానికి ఆహ్వానించాక రాయితీల్లాంటి వాటి ప్రస్తావన వస్తే కాదంటారా....! ప్రస్తుతం సైరా సినిమా ఘన విజయం మెగాస్టార్లో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. తన కెరీర్ లోని టాప్ 5 చిత్రాల్లో ఇది కచ్చితంగా ఉంటుందంటున్నారాయన. అందుకే.. ప్రముఖలందరినీ సినిమాకి పిలుస్తున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసైను కలిసి సినిమాకు ఆహ్వానించిన చిరంజీవి.. ఆమె కోసం ప్రత్యేకంగా షో వేయించారు. అలాగే ఇప్పుడు ఏపీ సీఎం కూడా వస్తారంటున్నారు.

సినిమాల పరంగా చూస్తే ఇదంతా ఆల్‌ ఈజ్ వెల్‌గానే అనిపిస్తోంది. పైగా తెలుగు ఇండస్ట్రీపెద్దలెవరూ జగన్ సీఎం అయ్యాక కలవలేదన్న అపవాదు ఉంది. ఇప్పుడు చిరు జగన్‌ను కలిస్తే పాజిటివ్ మార్క్ పడినట్టే. పనిలో పనిగా ఏపీలో చిత్ర పరిశ్రమకు ఇచ్చే ప్రోత్సాహకాలు ఇతరత్రా అంశాలపై కూడా చర్చ జరిగితే మరింత బాగుంటుంది. సినీ కోణంలో ప్రభుత్వంతో సానుకూలంగా ఉంటే ప్లస్సులు బాగానే కనిపిస్తాయ్. ఎలాగూ సీఎం నివాసంలో విందు స్వీకరిస్తారు కాబట్టి.. ఆ చిట్‌చాట్‌లో చాలా అంశాలు ప్రస్తావనకు వస్తాయన్న టాక్ వచ్చింది. ఆ సిట్టింగ్‌లో పర్‌ఫెక్ట్ స్క్రీన్‌ప్లే వర్కవుటయి షాట్ ఓకే అవుతుందంటున్నారు.

చిరంజీవి జగన్‌ను కలవడంపై మంత్రి బొత్స సత్యనారయాణ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది వచ్చి కలుస్తుంటారని.. గతంలో నాగార్జున, మోహన్‌బాబు కలిసినట్టే ఇప్పుడు ఇంకొందరు కలుస్తున్నారన్నారు. ఇండస్ట్రీ వాళ్లు కలవడం అంటే బాలయ్యే ప్రత్యేకంగా వచ్చి కలవాలా ఏంటని చలోక్తులు విసిరారు. అసలు ఈ మీటింగ్‌కి రాజకీయ ప్రాధాన్యమేమీ లేదని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో చిరంజీవిది ఫెయిల్యూర్ స్టోరీయే. నాడు వైఎస్సార్‌ను ఓడించి సీఎం అవుదామనుకున్న మెగాస్టార్..... చివరికి తన ప్రజారాజ్యం పార్టీనే కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజ్యసభ టర్మ్ అయిపోగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి మేకప్ వేసుకున్నారు. 150,151, 152 అంటూ సినిమాల్లో బిజీ అయ్యారు. కానీ.. పాలిటిక్స్‌లో అన్నకు జరిగిన అవమానాన్ని మాత్రం పవన్ మర్చిపోలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారీ పాత విషయాలు నెమరువేసుకుని వాళ్లందరికీ వార్నింగులిస్తూనే ఉన్నారు. వైసీపీ అంటేనే ఒంటికాలిపై లేస్తున్నారు. కానీ.. ఇప్పుడు అదే వైసీపీ నేతలతో చిరంజీవి ఎందుకు సన్నిహితంగా ఉంటున్నారో పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి అంతుచిక్కడం లేదు. ఇక్కడే కొన్ని అంశాల్ని పోల్చి చూసుకుని ఎవరి సమాధానాలు వాళ్లు చెప్పుకుంటున్నారు.

అయ్యన్నపాత్రుడు లాంటి ఒకరిద్దరు టీడీపీ నేతలు పొలిటికల్ పొత్తులపై ఈ మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కూడా తప్పనిసరైతే తెలుగుదేశంతో కలుస్తారు తప్ప.. వైసీపీవైపు మొగ్గు చూపే అవకాశమే లేదు. ఈ పరిస్థితుల్లో చిరంజీవి జగన్‌ను కలుస్తుండడం కొందరిని ఆశ్చర్యానికి గురి చేసినా.... పవన్‌కు డ్యామేజ్ చేసే పని చిరంజీవి చేయబోరని, అన్నదమ్ముల మధ్య అనుబంధం బాగానే ఉందని సన్నిహితులు చెప్తున్నారు. సైరా సినిమాకు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పిన సంగతి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జగన్‌ను చిరంజీవి కలుస్తున్నది సినిమా వరకేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలంటున్నారు.

ఇటీవల మెగాస్టార్ తాడేపల్లిగూడెంలో పర్యటించారు. ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షించింది YCP లీడర్లే. నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ దగ్గరుండి అంతా చూసుకున్నారు. విగ్రహావిష్కరణకు అనుమతులు, ఇతరత్రా ఏర్పాట్ల బాధ్యతలన్నీ MLA కొట్టు సత్యనారాయణ భుజానికెత్తుకోవడం చాలా సంతోషంగా ఉందని స్వయంగా చిరంజీవే అన్నారు. అలాగే.. వట్టి వసంత్ కుమార్ కూడా ఈ సభలో కీరోల్ పోషించారు. ఇక టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా విజయవాడ ఎయిర్ పోర్టులో చిరంజీవి దిగినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నారు. వీళ్లతోపాటు మరికొందరు కాపు నేతలు కూడా చిరంజీవితో కలిసిమెలిసి తిరిగారు. వీళ్లలో చాలా మంది వైసీపీ వాళ్లయితే.. మిగతా లీడర్లు ఇవాళో రేపో అటు జంపైపోదాం అని చూస్తున్నవాళ్లు. సైరా సినిమాలో పాలెగాళ్లు ఏకం అయినట్టే ఇక్కడా పొలిటికల్‌గా ఏమైనా జరుగుతుందా.. కాపు నేతలు మూకుమ్మడిగా ఎటు వెళ్తారు అనే చర్చ జరుగుతోంది. ఐతే.. ఎస్వీఆర్ విగ్రహావిష్కరణను పొలిటికల్ కోణంలో చూడలేమంటున్నారు విశ్లేషకులు. ఇందులో టీడీపీ, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీల నేతలు ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

ఇటీవలే జనసేనకు గుడ్‌బై చెప్పిన విశాఖ జిల్లాకు చెందిన చింతలపూడి వెంకట్రామయ్య త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారంటున్నారు. ఆయన చిరంజీవి బంధువు. తాను ఏ పార్టీలో ఉన్నా చిరంజీవికి అత్యంత సన్నిహితంగా ఉండే గంటా కూడా YCPలో చేరే విషయంపై ఊగిసలాటలో ఉన్నారని రోజూ వార్తలు వస్తున్నాయి. నిజానికి.. వీళ్లు పార్టీ మారడం వెనుక, మారే ప్రయత్నాల వెనుక నేరుగా చిరంజీవి ప్రమేయం ఏమీలేదు. కానీ.. ఆయన వర్గమంతా కట్టకట్టుకుని వెళ్తున్నట్టుగా కనిపిస్తుండడమే చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్‌ అభిమానుల్ని ఈ పరిణామాలు ఆందోళనకు, ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. చిరు సన్నిహితంగా కాపు నేతలుగా చెలామణీ అవుతున్నవాళ్లెవరూ కూడా ఈ కష్టకాలంలో పవర్‌ స్టార్‌కు సపోర్టుగా నిలబడడం లేదన్నది వాళ్ల బాధ. చిరంజీవికి కోస్తా జిల్లాల్లో ఉన్న ఆదరణ దృష్ట్యా చూస్తే.. జగన్- చిరంజీవి భేటీ YCPకి మేలు చేస్తుందంటున్నారు. మెగాస్టార్ అసలు జగన్‌ను కలవడం ఎందుకనేది ఇంకొందరి ప్రశ్న. ఇది పొలిటికల్‌ భేటీ కానేకాదని చెప్తున్నా కొందరిలో చాలా అనుమానాలు ముసురుకుంటూనే ఉన్నాయి.

చిరంజీవి, జగన్ ఇద్దరి మధ్య రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ విభేదాలైతే ఏమీ లేవు. ఆయా రంగాల్లో ప్రముఖులుగా ఒకరంటే ఒకరికి అభిమానం మాత్రం ఉంది అంతే. గతంలో వీరిద్దరూ కలిసిన సందర్భాలు కూడా లేవు. ప్రస్తుతం సైరా సినిమాను చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి.. ప్రముఖుల్ని సినిమాకు ఆహ్వానిస్తున్నారని ఈ భేటీని అంతవరకే చూడాలన్నది చిరు టీమ్ మాట. జగన్‌ది కూడా రాయలసీమ కాబట్టి.. ఈ కథ సీమకు చెందిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిది కాబట్టే ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారని వారంటున్నారు. ఐతే.. పవన్ ఫ్యాన్స్ దీన్ని డిఫరెంట్‌గానే చూస్తున్నారు. సినిమా ప్రమోషన్ అయనా.. మరో విషయం అయినా ఇంత వరకూ చిరంజీవి నేరుగా ఇలా ఇంటికి వెళ్లి ఎవరినీ కలిసిన సందర్భం లేదు. ఒకడ్రెండు ఫంక్షన్లలోనో, అధికారిక కార్యక్రమాల్లోనో తప్ప.. కేసీఆర్‌ను కూడా విడిగా చిరంజీవి కలిసిన దాఖలాలు లేవు. కానీ ఏపీలో ప్రత్యేకంగా జగన్‌ను కలుస్తున్నారు. ఇదే ఇప్పుడు రకరకాల ఊహాగానాలకు కారణమవుతోంది.

మెగా ఫ్యాన్స్‌లో ఉన్నట్టే వైసీపీలోనూ దీనిపై రకరకాల ఊహాగానాలొస్తున్నాయి. కొందరు అప్పుడే ఈ భేటీ పేరు చెప్పి జనసేనను, మెగా ఫ్యామిలీని తిట్టడం మొదలుపెట్టారు. నాడు జగన్ జైల్లో ఉంటే చట్టం తన పని తాను చేసుకుని పోతుందంటూ కామెంట్ చేసిన వాళ్లు.. ఇప్పుడు అదే జగన్‌ను కలిసి ఆయన కరుణ కోసం చూస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. కొందరు లీడర్ల పేరు మీద ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్, పొలిటికల్ వార్ నేపథ్యంలో.. 14న జరిగే చిరంజీవి- జగన్ మీటింగ్ సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. చివరికి ఈ మీటింగ్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తుంది.. సినిమాల వరకే ఈ బంధం పరిమితం అవుతుందా.. అన్నయ్య ప్లాన్ ఏంటన్నది అనేది సోమవారం తెలిసిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story