ఇది నెల్లూరు జిల్లానా లేక పులివెందుల.. – చంద్రబాబు

నెల్లూరు జిల్లా పర్యటనలో బిజీబిజీగా గడిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించడంతోపాటు..వైసీపీ దాడులతో నష్టపోయిన వారిని ఒక్కొక్కరిగా పిలిచి పరామర్శించారు. ఆత్మకూరు నియోజకవర్గం మినగల్లులో హత్యకు గురైన వెంగయ్య కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు.రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ తన కుటుంబమని.. తన కుటుంబం జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. వైసీపీ దాడుల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లాలో అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు చంద్రబాబు. అసలు ఇది నెల్లూరు జిల్లానా లేక పులివెందులో అర్థం కావడం లేదని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదని చెప్పారు. పోలీసుల తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. వైసీపీ అండతో కొందరు రెచ్చిపోతున్నారని.. వాళ్లందరూ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

వైసీపీ దాడులతో నష్టపోయిన కార్యకర్తలకు అండగా ఉండి వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పారు చంద్రబాబు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపైనా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నేతలతో సమావేశమైన ఆయన.. మిగతా నియోజకవర్గాల నేతలతో భేటీ అయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Recommended For You