'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

రాజుగారి గది 3 మూవీ రివ్యూ

ఫ్రైడే వచ్చిందంటే సినిమా అభిమానులకు పండగే. కానీ ఈ మధ్య చాలా ఫ్రైడేలు దండగ అనిపిస్తున్నాయి. కారణాలేవైనా దసరా తర్వాత కాస్త ఎక్కువ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది రాజుగారి గది-3. ఓంకార్ స్వీయ దర్శకత్వంలో అశ్విన్ బాబు, అవికా గోర్ జంటగా నటించిన ఈ మూవీ ఇవాళ విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది. గత రెండు భాగాల్లాగానే ఈ పార్ట్ కూడా హిట్ అనిపించుకుందా లేదా అనేది చూద్దాం..

అశ్విన్ ఓ ఆటోడ్రైవర్. అనాథ. తన మామతో కలిసి ఓ కాలనీలో ఉంటుంటాడు. ఆ కాలనీలో ఇతని అల్లరి భరించలేక వెళ్లగొట్టాలనే ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు. మాయ డాక్టర్. ఓ రోజు తన ఆటోలో వచ్చిన మాయను కొందరు రౌడీలు ఇబ్బంది పెడితే అశ్విన్ కాపాడతాడు. కానీ అశ్విన్ వెనక ఏదో అదృశ్య శక్తి అడ్డుపడుతుంది అప్పుడు. హాస్పిటల్ లో ఓ డాక్టర్ మాయను ప్రేమిస్తున్నాను అంటే అదే అదృశ్యశక్తి భయపెడుతుంది. దీంతో తమ కాలనీలో ఉండే అశ్విన్ ను మాయ ప్రేమలో పడేస్తే అతని పీడ వదులుతుందని ప్లాన్ చేసి.. సక్సస్ అవుతారు. మాయ, అశ్విన్ ప్రేమించుకుంటారు. అయితే వీరి ప్రేమకు కూడా అదే శక్తి అడ్డుపడుతుంది. అసలు ఆ శక్తి ఎవరు..? ఎందుకు అడ్డుకుంటుంది..? దాన్నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు. అనేది మిగతా కథ.

రాజుగారి గది -3 ఫక్తు ఫార్ములా సినిమానే. ఎక్కడా మీటర్ దాటకుండా మేటర్ ఓపెన్ చేస్తూ మెజారిటీ సీన్స్ లో ఎంటర్టైన్ చేస్తూ వెళుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొంత లాగ్ ఉన్నా.. దెయ్యానికి సంబంధించిన సీన్స్ వచ్చిన ప్రతిసారీ అలెర్ట్ అయిపోతారు. అలీ, అశ్విన్ మధ్య వచ్చే సీన్స్ అన్నీ ఫన్నీగా బావున్నాయి. లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది. అలాగే కాలనీలో ఉన్న మెంబర్స్ తో పండించిన కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. మాయకు ఎవరైనా ఐలవ్యూ చెబితే ఓ దెయ్యం వచ్చి వారిని భయపెడుతుంది. హీరో చెప్పినప్పుడు అలా జరగదు అనుకుంటే అందరికంటే ఎక్కువగా అతన్నే భయపెడుతుంది. ఇది కాస్త సర్ ప్రైజ్ తో పాటు సెకండ్ హాఫ్ పర్ఫెక్ట్ లీడ్ గా మారింది. ఇంటర్వెల్ బ్యాంగ్ సింప్లీ సూపర్బ్.

ఇక సెకండ్ హాఫ్ లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకూ మాయ తండ్రి గురించి చెప్పిన బిల్డప్ సీన్స్ చూసి ఎంతో ఊహించుకున్న ఆడియన్స్ కు షాక్ ఇస్తూ ఆ క్యారెక్టర్ ను మార్చిన విధానం హిలేరియస్. మాయ వెనక ఉన్న అదృశ్య శక్తికి కారణం తెలిసిన తర్వాత మొదలైన సీన్ దాదాపు 20 నిమిషాల పాటు సాగుతుంది. ఈ ఇరవై నిమిషాలూ హిలేరియస్ అనే చెప్పాలి. ముఖ్యంగా.. అజయ్ ఘోష్, ఊర్వశిలతో పాటు అలీ లో నవ్వాపుకోవడం ఎవరి తరం కాదు. క్లైమాక్స్ లో అవికా గోర్ పాత్రతో ఇచ్చిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది.

మొత్తంగా హారర్ ఎంరట్టైనర్ ఫార్ములాను దాటకుండానే ఓంకార్ మరోసారి సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆడియన్స్ ఏం ఆశించి రాజుగారి గది-3కి వస్తారో .. ఆ అంశాల్లో ఎక్కడా డిజప్పాయింట్ చేయదనే చెప్పాలి. నటన పరంగా అశ్విన్ బాబు చాలా మెరుగయ్యాడు. అవికాగోర్ గ్లామర్ గా ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత అలీ అదరగొట్టాడు. అజయ్ ఘోష్, ఊర్వశి, ధన్ రాజ్ సినిమాకు కామెడీకి మెయిన్ పిల్లర్స్ గా నిలిచారు. ఇక టెక్నికల్ గా రాజుగారి గది-3కి మెయిన్ ఎస్సెట్ సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈ రెండూ ది బెస్ట్ అనే చెప్పాలి. మొత్తంగా ఫార్ములా దాటకుండా రాజుగారి గది-3 ఫ్రాంచైజీలో మరో హిట్ అందుకున్నట్టే అని చెప్పాలి.

Tags

Read MoreRead Less
Next Story