కర్ణాటకలో జనజీవనం అస్తవ్యస్తం

కర్ణాటకలో జనజీవనం అస్తవ్యస్తం

భారీ వర్షాలు, వరదలో కర్నాటక కుదేలవుతోంది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బెళగావి, ధార్వాడ, చిత్ర దుర్గ, బాగల్కోట్, హావేరీ, గదగ్‌, హుబ్బళ్ళి, కొడుగు, సవదట్టి జిల్లాలు నీట మునిగాయి. 2 వందలకు పైగా ఇళ్లు కూలిపోయాయి. వేల సంఖ్యలో ఇళ్లు దెబ్బ తిన్నాయి. నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వంతెనలపై నుంచి నీరు ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి.

చిక్కోడిలో వరదనీరు గ్రామాలలోకి రావడంతో ఆంజనేయస్వామి ఆలయంలోకి నీరు చేరింది. సంకేశ్వర లక్ష్మీగుడి సమీపంలో వాహనాలు కొట్టుకుపోయాయి. సౌందట్టి ఎల్లమ్మ ఆలయం నీట మునిగింది. ఇక రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.

గదగ్ జిల్లాలోని హోసూరు గ్రామంలో పాతకాలం నాటి ఇల్లు ఒకటి కుప్పకూలిపోయింది. ముందస్తు చర్యల్లో భాగంగా అందులో ఉన్నవారిని ఖాళీ చేయించడం తో ప్రాణనష్టం తప్పింది. అటు పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు స్తంబించాయి.

బెళగావి జిల్లా గోకాక్‌లో మల్లికార్జున కొండ నుంచి బండరాళ్లు జారి పడుతున్నాయి. దీంతో.. స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణనష్టం సంభవించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. SDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

తమిళనాడు, కేరళల్లోనూ వరదపోటు కొనసాగుతోంది. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నా యి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరికొన్ని రోజులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story