అయ్యప్పమాలలో అంతర్లీనంగా దాగున్న సైంటిఫిక్ ప్రయోజనాలు..

అయ్యప్పమాలలో అంతర్లీనంగా దాగున్న సైంటిఫిక్ ప్రయోజనాలు..

ayyappa.png

పవిత్రమైన కార్తీక మాసంతో అయ్యప్ప భక్తుల హడావిడి మొదలవుతుంది. 41 రోజుల దీక్షను చేపట్టి నియమ నిష్టలతో భగవంతున్ని ఆరాధిస్తుంటారు. స్వాములు పొద్దున్నే చేసే చన్నీళ్ల స్నానం.. ఒక్కపూటే భోజనం.. చెప్పుల్లేకుండా నడవడం.. రెండు పూట్లా భక్తితో అయ్యప్ప ఆరాధన.. ప్రతి రోజూ భజనలు.. దురలవాట్లకు దూరంగా.. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ 41 రోజులు మండల దీక్షను చేసే అయ్యప్ప మాలధారులను కనిపించే దైవంగా చూస్తారు భక్తులు, బంధుమిత్రులు. అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుంది. రోజూ ఉదయం, సాయింత్రం పూజలు, దీపారాధనలు, భజనలతో ఆ ఇల్లు ప్రశాంత నిలయంగా మారుతుంది. మాల ధారణ ద్వారా పుణ్యంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతుందని స్వాములు విశ్వసిస్తారు. దీక్షకాలంలో చేసే కఠిన నియమ నిబంధనలలో సైంటిఫిక్ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.

తలస్నానం: దీక్షలో ఉన్న స్వాములు ఉదయం, సాయింత్రం చన్నీళ్లతో తల స్నానం చేస్తుంటారు. ఆలోచనలకు కేంద్ర బిందువైన మెదడు తీవ్ర వత్తిడికి గురయ్యి వేడెక్కి పోతుంటుంది. దీనికి విరుగుడుగా చన్నీటి స్నానం ఉపకరిస్తుంది. ఉష్ణాన్ని హరించేందుకు చన్నీటి స్నానం ఆచరించాలని అయ్యప్ప నియమావళి చెబుతుంటుంది.

నలుపు రంగు దుస్తులు: ఈ దుస్తులు ధరిస్తే శని దేవుడి చూపు ఉండదని భక్తుల విశ్వాసం.. ప్రత్యేకంగా నలుపు వేడిని ఆకర్షిస్తుంది. శరీరానికి కావలసిన ఉష్ణోగ్రతను అందించి సమతుల్యతకు దోహదం చేస్తుంది నలుపు రంగు. అందుకే గజగజ వణికే చలిలో కూడా స్వాములు నిశ్చలంగా ఉంటారు.

దీక్ష చేపట్టిన స్వాములు చెప్పుల్లేకుండా నడుస్తుంటారు. ఎక్కడికైనా పాదరక్షలు లేకుండానే వారి ప్రయాణం సాగుతుంటుంది ఆ 41 రోజులు. పాదాలు నేరుగా భూమిని తాకుతుండడంతో రక్తప్రసరణ సక్రమంగా సాగుతుంది. హృ దయ స్పందనలు సరిగా ఉంటాయి.

స్వాములు నుదుటి మధ్య భాగంలో పెట్టుకునే చందన, విభూధి చల్లదనం కలిగించి ఒత్తిడిని దూరం చేస్తుంది. నాడీ మండలానికి కేంద్రమైన నుదుటి భాగంలో చందన ధారణ చేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుందని సైన్స్ చెబుతోంది.

నేల మీద నిద్ర.. భూమి తల్లితో సమానం. నేలపై పడుకుంటే అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నట్లే అని ఆధ్యాత్మిక భావన. మనసు ప్రశాంతత కోసం నేలపై పడుకోవడం శ్రేయస్కరమని యోగ శాస్త్రం కూడా చెబుతుంటుంది.

మాల ధారణలో ఒక్కపూటే భోజనం చేయడం వలన దీక్షా కాలంలో ఉన్న 41 రోజుల్లో 20 రోజులు ఉపవాసం ఉన్నట్లు అవుతుంది. శరీరం శుభ్రపడుతుంది. కొవ్వు కణజాలం మొత్తం ఈ సమయంలో వినియోగమవుతుంది. దీనివల్ల శారీరక అలసట దూరమవుతుంది.

అయ్యప్ప భక్తులు ఆచరించే మరో కఠిన నియమం దాంపత్య జీవితానికి, దురలవాట్లకు దూరంగా ఉండడంతో ఇహలోక సౌఖ్యాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తన కుటుంబం పట్లే కాకుండా, సమాజం పట్ల కూడా ప్రేమాభిమానాలు కలుగుతాయి. ఆరోగ్యవంతమైన సమాజానికి అయ్యప్ప దీక్ష సాయపడుతుంది.

Read MoreRead Less
Next Story