ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు అనుమతించిన ముఖ్యమంత్రి

కార్మిక సంఘాలతో చర్చలకు అనుమతించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. విలీనం మినహా హైకోర్టు సూచించిన 21 డిమాండ్లపై చర్చించడానికి అధికారులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపాల్సిందిగా ఆర్టీసీ ఇన్‌చార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను ఆదేశించారు. బస్‌ భవన్‌లో ఈ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త వేతనాల అమలు, ఉద్యోగ భద్రత, ఖాళీల భర్తీ తదితర 26 డిమాండ్లతో కార్మికులు ఈనెల 5వ తేదీ నుంచి సమ్మెను ప్రారంభించారు. వీటిలో 21 డిమాండ్లు పరిష్కరించదగినవేనని, వీటిపై ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు చేపట్టి, పరిష్కరించాలంటూ హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఈనెల 28న జరిగే తదుపరి విచారణ కల్లా చర్చల సారాంశాన్ని వివరించాలని నిర్దేశించింది.

కోర్టు ఆదేశాలతో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ప్రభుత్వం ఈడీలు, ఫైనాన్షియల్‌ అడ్వయిజర్లను కలిపి ఆరుగురు అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ మూడు రోజులుగా డిమాండ్లపై అధ్యయనం చేసి నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలోనే, వీటిపై ప్రభుత్వం, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. హైకోర్టు సూచించిన 21 డిమాండ్లలో 12 వరకు డిమాండ్లకు పెద్దగా ఆర్థికపరమైన చిక్కులు లేవన్న నిర్ధారణకు వచ్చారు. వాటిపై చర్చలకు పిలవాలని నిర్ణయించారు.

అయితే ఆర్టీసీ జేఏసీ మాత్రం మొదట్నుంచి విలీనం అంశంపై పట్టుదలగా ఉంది. దీంతో చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే 20 రోజులకుపైగా కార్మికులు సమ్మెలో ఉండటం..వరుస పండగలు..కార్మికులకు జీతాలు అందకపోవటం ఓ వైపు..మరోవైపు సమ్మె విరమించకుంటే ఆర్టీసీ పని క్లోజ్ అంటూ కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో యూనియన్ల వెనక్కి తగ్గుతాయా? విలీనం తర్వాతే ఏదైనా అని పట్టుబడతాయా అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story