ప్రకాశం వైసీపీలో మూడు కుంపట్లు.. ఆరు గ్రూపులు

ప్రకాశం వైసీపీలో మూడు కుంపట్లు.. ఆరు గ్రూపులు

ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. వైసీపీ 8 స్థానాల్లో విజయఢంకా మోగించింది. రాష్టృంలో ఏకపక్ష ఫలితాలు సాధించటంతో జిల్లాలోని వైకాపా నేతలు దూకుడుగా వ్వవహరించసాగారు. ఈ క్రమంలో ఉద్యోగుల బదిలీలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో నేతల మధ్య అంతరాలు మొదలయ్యాయి. తమ మాటే చెల్లుబాటు కావాలంటూ ఎవరికివారు రాజకీయాలు చేస్తుండటంతో మూడు కుంపట్లు.. ఆరు గ్రూపులు అన్న చందంగా అధికార పార్టీ పరిస్థితి తయారైంది.

ప్రస్తుతం ఆరు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారా స్ధాయికి చేరింది. తాజాగా పర్చూరు పరిణామాలను పరిశీలిస్తే కొందరు కీలక నేతల రాజకీయ క్రీడలో భాగంగా గతంలో ఇన్‌ఛార్జ్‌గా ఉండి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన రావి రామనాధం బాబును పార్టీలోకి చేర్చుకున్నారు. సిఎం జగన్‌ సమక్షంలోనే ఆయన చేరటంతో సీనియర్‌ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గ్రూపు వేంటనే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. దగ్గుబాటినే ఇన్‌ఛార్జ్‌గా కొనసాగించాలని కోరారు. దగ్గుబాటికి చెక్‌ పెట్టెందుకు రామనాధం బాబును తీసుకు వచ్చారనే చర్చ సాగుతోంది. ఏదేమైనా ఇక్కడ రెండు గ్రూపులుగా న్యాయకత్వం చీలిపోయింది.

చీరాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఆయన సోదరుల వ్యవహార శైలిపై ఆధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా గతంలో ఇన్‌చార్జ్‌గా వ్యవహరించి ఎన్నిల సమయంలో టీడీపీలో చేరిన యడం బాలాజీని పార్టీలోకి తీసుకుని ఆమంచికి చెక్ పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. అద్దంకిలో మాజీ ఎమ్మెల్యే సీనియర్‌ నేత బాచిన చెంచు గరటయ్య పెత్తనాన్ని అక్కడ ఒక సామాజిక వర్గం వ్యతిరేకిస్తోంది. గరటయ్యకు వ్యతిరేకంగా ఉన్న నేతలకు అధినేత సమీప బంధువులు లోపాయికారీ మద్దతు ఉండటంతో బదీలీలు, ఇతర విషయాల్లో ఆ సామాజిక వర్గం నేతలు క్రీయాశీలకంగా వ్యవహరిస్తూన్నారు. ఏదేమైనా ఇక్కడ న్యాయకత్వంలో సమన్వయం కనిపించటం లేదు. రానున్న కాలంలో ఇక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే చర్చ సాగుతుంది.

2014 ఎన్నికలలో వైసీపీ నుంచే కొండపిలో పోటీచేసి ఓడిపోయిన జూపూడి ప్రభాకర్‌రావు తిరిగి వైసీపిలో చేరారు. 2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి టీడీపీకి వచ్చాక ఆయన ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా రెండు సార్లు పనిచేశారు. తెలుగుదేశం నుంచి 2019 ఎన్నికల్లో కొండపి సీటు ఆశించారు జూపూడి. జిల్లాలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాలు కొనసాగించాలని నిర్ణయించారు. ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.

విజయసాయిరెడ్డి సహకారంతో తిరిగి మళ్లీ వైసీపిలో చేరటంతో కొండపి నియోజకవర్గంలో తర్జనభర్జనలు మొదలయ్యాయి. ఇప్పటికే అక్కడ రెండు గ్రూపులుగా నేతలున్నారు. జూపూడి కూడా ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే కొండపి వైసీపీ మూడుముక్కలు కానుందనే చర్చ ఉంది. ఆయన్ను రాజధానికి పరిమితి చేస్తారా.. ఆయనకు ఇచ్చే ప్రధాన్యత ఏమిటనేది చూడాలి.

దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గ్రూప్‌ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రారంభంలోనే ఓ పోలీసు అధికారి బదిలి విషయంలో తమ సత్తా చాటుకున్న బూచేపల్లి గ్రూప్‌ ఇప్పటీకీ ప్రత్యేకంగానే కొనసాగుతోంది. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కూడా నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తన గ్రూప్‌ను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తో కలిసి పనిచేయాలని పైకి చెబుతున్నప్పటికీ, ముఖ్య విషయాల్లో రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది.

గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వర్గాలుగా నాయకులు విడిపోయి ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. వీళ్ల మధ్య కూడా అనేక విషయాల్లో విభేదాలున్నాయి. ఏదిఏమైనా అధికార పార్టీలో ఆధిపత్యపోరు పతాక స్ధాయికి చేరటంతో ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందోన్న ఆందోళన కార్యకర్తల్లో ఉంది. అభివృద్ది పనులు వేగం పుంజుకున్నాక కాంట్రాక్టుల విషయంలో మరిన్ని పేచీలు తలెత్తె పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story