హాస్టల్ రూమ్ షేర్ చేసుకుంటున్నారా.. జాగ్రత్త

హాస్టల్ రూమ్ షేర్ చేసుకుంటున్నారా.. జాగ్రత్త

hostel

చదువులు, ఉద్యోగాల నిమిత్తంగా హాస్టల్స్‌లో ఉండక తప్పని పరిస్థితి. హాస్టల్ మేట్ రెండ్రోజుల్లోనే కలిసిపోతాడు. అన్నింటికీ తానున్నానంటూ భరోసానిస్తాడు. మాయమాటలతో నమ్మ బలుకుతారు. చివరికి మొత్తం డాటా లాగేసి ఉడాయిస్తారు. రోజులు అలా ఉన్నాయి. మనుషులు మారిపోతున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి తెలివితేటలు పెరిగిపోయాయి. అకౌంట్లో డబ్బుని క్షణాల్లో మాయం చేస్తున్నారు. ఈ రోజుల్లో అన్నీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్. కొనాలన్నా, తినాలన్నా కార్డు గీరేస్తున్నారు. అదే అవకాశంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.

ఫోన్ సిమ్‌లోనే డేటా అంతా భద్రపరుచుకోవడంతో ఆ ఒక్క సిమ్ కొట్టేస్తే చాలు.. నీ జుట్టు నా చేతిలో అన్న చందంగా నేరాలు సాగిస్తున్నారు కేటుగాళ్లు. హాస్టల్‌లో ఉంటున్న కార్తీక్ కూడా అలానే మోసపోయాడు. చైన్నైకి చెందిన కార్తీక్ హైదరాబాద్‌లో ఓ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల నుంచి మాదాపూర్ సెరెన్ హాస్టల్‌లో ఉంటున్నాడు. అది షేరింగ్ రూమ్ కావడంతో ఈ నెల 17న ఓ కుర్రాడు వచ్చి 10 రోజులు ఉండి వెళ్లి పోయాడు. అతడు వెళ్లిన తరువాత కార్తీక్ ఫోన్ ‌లోని సిమ్ పనిచేయలేదు. దగ్గర్లో ఉన్న మొబైల్ రిపేర్ షాప్‌కి వెళ్లాడు. ఈలోపు అకౌంట్లో ఉన్న రూ.2 లక్షలు మాయం అయ్యాయి. కార్తీక్ ఫోన్‌లో డమ్మీ సిమ్ కార్డు పెట్టి రూమ్ షేర్ చేసుకున్న వ్యక్తి చెక్కేసాడని తెలుసుకున్నాడు.

రూమ్మేట్ ఉన్నన్ని రోజులు కార్తీక్‌పై నిఘా ఉంచాడు. క్రెడిట్ డెబిట్ కార్డులు వాడుతున్నాడని తెలుసుకున్నాడు. వెళ్తూ వెళ్తూ వాటిని వాటిని ఫోటో తీసుకుని ఫోన్‌ని నీళ్లలో పడేసి.. పని చేయకుండా చేసాడు. సైబర్ క్రైంపోలీస్‌లకు సమాచారం అందించగా.. నిందితుడు ప్లాన్ ప్రకారం ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హాస్టల్ నిర్వాహకులు కూడా నేరగాడిని ఎలాంటి ధ్రువీకరణపత్రాలు తీసుకోకుండానే రూమ్ ఇచ్చేశారు. మొబైల్ లొకేషన్ ద్వారా నేరగాడిని పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరినీ అనుమానించాల్సిన పరిస్థితులు వచ్చాయి. వీలైనంత వరకు అపరిచిత వ్యక్తులతో సంభాషణ, ఆర్థిక విషయాలను షేర్ చేసుకోకపోవడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

Read MoreRead Less
Next Story