ఆ హీరో.. హీరోయిన్ పెళ్లి చేసుకుంటే నాకు..

వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచంలో నాకంటే సంతోషించేవాళ్లు ఎవరూ ఉండరు అని బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఆనందంగా చెబుతోంది రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్‌ల పెళ్లి గురించి. రణ్‌బీర్‌కు కరీనా వరుసకు సోదరి అవుతుంది. ముంబయలోని ‘జియో మామి మూవీ మేలా’ వేడుకలకు కరీనాతో పాటు దీపికా పదుకొణె, ఆలియా, జాన్వీ కపూర్, కరణ్ జోహార్ తదితరులు హాజరయ్యారు. వారి సరదా సంభాషణలో ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ముచ్చట వచ్చింది. ఈ విషయంపై కరీనా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

కరీనాకు మరదలు అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా అని ఆలియాను అడిగితే అసలు ఊహించలేదని చెప్పుకొచ్చింది. మరి పెళ్లయిన తరువాత హీరోయిన్‌గా కొనసాగుతారా అంటే.. నాయికలకు పెళ్లి తరువాత కెరీర్ జీరో అనే అపోహలను బద్దలు కొట్టేసింది కరీనా.. ఆమే మాలాంటి వాళ్లకు స్ఫూర్తి అని ఆలియా చెప్పింది. తాను నటించిన కళంక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడగా.. ఆ సమయంలో రణ్‌బీర్ తనకు చాలా సపోర్ట్ ఇచ్చాడని తెలిపింది. నటించిన సినిమాలన్నీ హిట్టవ్వవు. అలా అని మన ప్రయత్నం ఆపకూడదు. మరో మంచి పాత్ర వచ్చినప్పుడు ప్రతిభను నిరూపించుకోవాలి అని రణ్‌బీర్ ధైర్యం చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంది ఆలియా.