తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన చలో ట్యాంక్‌బండ్‌

chalo-tank-bund

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మిక నేతలు పిలుపిచ్చిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల అనుమతివ్వకపోయినా.. భారీ సంఖ్యలో కార్మికులు, వివిధ సంఘాల నేతలు, విపక్ష పార్టీల నేతలు ట్యాంక్‌బండ్‌కు చేరుకునే ప్రయత్నం చేశారు. వారందరనీ పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

పోలీసులు ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా.. కొందరు కార్మికులు మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ వద్దకు ఆందోళనకారులు చేరుకున్నారు. వందల మంది కార్మికులు అకస్మాత్తుగా వచ్చి నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. కొద్ది సేపు ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టులు చేశారు. ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసుల తీరుపై కార్మికులు మండిపడ్డారు..

ముందుగానే ట్యాంక్ బండ్ వైపు వచ్చే దారులన్నీ కూడా పోలీసులు మూసివేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి తనిఖీలు చేశారు. ఇందిరాపార్క్, కవాడీగూడ కల్పన థియేటర్ జంక్షన్లు మూసివేసి ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. కార్మికులు వచ్చినా.. వారిని అడ్డుకుని అరెస్టు చేసి ఇతర ప్రాంతాలకు తరలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆర్టీసీ కార్మికులు పిలుపు ఇచ్చిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇతర బీజేపీ నేతలతో కలిసి ఆయన ట్యాంక్‌బండ్‌వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదానికి దిగారు.. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో.. జితేందర్‌ రెడ్డితో పాటు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం హైదరాబాద్‌లో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సభలు సమావేశాలు, నిరసనలకు అనుమతి లేకపోవడంతో ముందస్తుగా అరెస్టులు చేశామన్నారు..

ముందునుంచి అలర్ట్‌గా ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఛలో ట్యాంక్‌ బండ్‌ ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.. సాయంత్రం నుంచి ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు సడలించారు. వాహనాలను అనుమతించారు.

Recommended For You