మైనార్టీలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

మైనార్టీలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ddd

మైనార్టీలకు గుడ్‌న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. హజ్, జెరూసలేంతో పాటు బైబిల్‌లో పొందుపరిచిన పవిత్ర ప్రదేశాలకు వెళ్లే వారికి సర్కారు తరపున ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా.. ప్రభుత్వం వాటిని తిప్పికొట్టింది. ఇవి పవిత్ర యాత్రల కోసం ఇస్తున్న రాయితీలేనని.. కొత్తగా అమలు చేస్తున్న కార్యక్రమం కాదని స్పష్టం చేసింది.

అక్టోబరు 30న జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పవిత్ర యాత్రలకు వెళ్తున్న క్రైస్తవ, మైనార్టీలకు రాయితీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కేబినెట్ నిర్ణయాలను అమలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. రూ. 3 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారికి ఇచ్చే సాయాన్ని రూ. 40 వేల నుంచి 60 వేలకు పెంచారు. రూ.3 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి గతంలో రూ.20 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.30 వేలకు పెంచారు. హజ్, జెరూసలేంతోపాటు ఇతర క్రైస్తవ ప్రార్ధనాస్థలాల సందర్శనకు వెళ్లే వారికి కూడా ఆర్ధికసాయం పెంచాలని నిర్ణయించారు. మరిన్ని వివరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించవచ్చని తెలిపింది.

అయితే తాజా నిర్ణయంతో వైఎస్‌ జగన్‌ పాలనలో క్రైస్తవులకు పెద్దపీట వేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో తెలుగు మీడియం పాఠశాలలను ఎత్తేస్తున్నారని.. ఇప్పుడు జెరూసలేం యాత్రకు సాయాన్ని పెంచారని ఆరోపిస్తున్నాయి. ఇవన్నీ దేనికి సంకేతమని నిలదీస్తున్నాయి. అయితే ఈ విమర్శపై ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. పవిత్రయాత్రలకు రాయితీలు ఇవ్వడం దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ విధానమని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. క్రైస్తవులతోపాటు, మైనార్టీ సోదరులకూ రాయితీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని దీనికి సంబంధించి ఆయా విభాగాలు జీవోలు జారీచేస్తున్నాయని అన్నారు. ఈ జీవోలను పట్టుకుని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మతాలను అంటుగడుతూ చేస్తున్న ప్రచారం దుర్మార్గమైందంటూ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా ప్రకటన విడుదల చేశారు.

Tags

Read MoreRead Less
Next Story