ప్లాస్టిక్ వస్తువులు లేకుండా వివాహ వేడుక.. బంధువులంతా ఆశ్చర్యం..

ప్లాస్టిక్ వస్తువులు లేకుండా వివాహ వేడుక.. బంధువులంతా ఆశ్చర్యం..

Screenshot_1

ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ రాజ్యమేలుతోంది. ప్లాస్టిక్ లేకుండా పండుగలు,వేడుకలు జరగడమే లేదు. అయితే విజయనగరానికి చెందిన తూణిగుంట్ల గుప్తా, విజయకుమారి దంపతులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు.

తమ కుమార్తె వివాహాన్ని మాత్రం ఈ దంపతులు ప్రకృతి పరవశించిపోయేలా జరిపించారు. పర్యావరణానికి హాని కలగకుండా తమ కుమార్తె మౌనికకు విశాఖ వాసి కమలేష్‌తో వివాహం జరిపించారు. అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మలు, ఆకులు, పువ్వులే అలంకారాలుగా తెలుగుదనం ఉట్టిపడేలా, సంప్రదాయబద్ధంగా పెళ్లి తంతు నిర్వహించారు.

వధూవరుల పేర్లు సూచించే పట్టికను కూడా కొబ్బరి ఆకులతో అల్లిన తడిక మీద చేనేత వస్త్రంపై సహజ రంగులతో రాశారు. కేవలం అరటి, కొబ్బరి ఆకులు,తాటాకులతోనే మంటపాన్ని అలంకరించి, వరి కంకులను గుత్తులుగా వేలాడదీశారు.

కేవలం డెకరేషన్‌ మాత్రమే కాదు..విందులోనూ తాగేనీళ్ల దగ్గర్నుంచి, కిళ్లీ వరకూ ఆరోగ్యానికి మేలు చేకూర్చే పదార్థాలనే వాడారు. మట్టి గ్లాస్‌లతో తాగు నీరు, అరటి ఆకులలో భోజనం ఏర్పాటు చేశారు. పెళ్లికి వచ్చిన బంధువులందరికి గోగునారతో తయారు చేసిన సంచులు బహుమతిగా అందజేశారు.

పెళ్లి ముహుర్తం దగ్గర్నుంచి బంధువులను ఆహ్వానించడం వరకు.. పెళ్లికి కావాల్సిన సామాగ్రి నుంచి అతిథుల మర్యాదల వరకు అదో పెద్ద ప్రహసనమే. అలాంటిది పద్దతి ప్రకారం ప్లాస్టిక్ వస్తువుల జోలికి వెళ్లకుండా పర్యావరణ పరిరక్షణ సారం వెల్లడిస్తూ జరిగిన ఈ పెళ్లి వేడుక పలువుర్ని ఆకట్టుకుంది. మంచి నీళ్లు కూడా వట్టివేరు, చిల్లగింజలు, దాల్చిన చెక్క తుంగముస్టా, జీలకర్ర వేసి మరగబెట్టి చల్చార్చి వడకట్టి అతిథులకు అందించారు.

తమ కుమార్తెకు చిన్నప్పటి నుంచి సమాజానికి మంచి చేయాలనే ఆలోచన ఉండేదని మౌనిక తల్లిదండ్రులు తెలిపారు. ప్రతి ఒక్కరు పర్యావరణ హితంగా ఉండాలని మౌనిక భావించేది అని చెప్పారు.. ఈనేపథ్యంలోనే పర్యావరణ హితంగా వివాహ వేడుకను జరిపినట్లు తెలిపారు..

ప్లాస్టిక్ వస్తువులు కనిపించకుండా వివాహ వేడుక జరపడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పచ్చని పెళ్లి పందిరిలో నవ వధువులను పదికాలాల పాటు పచ్చగా జీవించాలని అతిథులు దీవించారు.

Tags

Read MoreRead Less
Next Story