జగన్ ఆరు నెలల పాలనపై పవన్ ఆరు మాటలు

జగన్ ఆరు నెలల పాలనపై పవన్ ఆరు మాటలు

pawan-kalyan

సీఎం జగన్‌ ఆరు నెలల పాలనపై ఆరు మాటల్లో ట్విట్టర్‌ వేదికగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఘాటుగా స్పందించారు. విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసిక వేదన, విచ్ఛిన్నం, అనిశ్చితి 6 నెలల కాలంలో చూశామన్నారు పవన్‌ కళ్యాణ్‌. కూల్చివేత పర్వాలు, ఉద్దేశపూర్వకంగా వరదనీరు రాజకీయాలు, కార్మికుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. కాంట్రాక్టులు రద్దులు చేసి.. దుందుడుకుతనంతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. శ్రీకాకుళం సామాన్య కార్యకర్తను మొదలుకుని.. పోలీసు వేధింపులు, ఎమ్మెల్యే రాపాక మీద కేసులు, మాజీ మంత్రి కోడెల ఉరేసుకోవడం, ప్రత్యర్థుల బత్తాయి చెట్లు నరకడం, ఛానెల్స్‌ బ్యాన్‌ చేయడం, తమకు ఓటెయ్యని వారిని బెదిరించడం వంటి కక్ష సాధింపు చర్యలకు దిగారని పవన్‌ ఆరోపించారు.

విలేజ్‌ వాలంటీర్లుగా 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. 2 లక్షల 89 వేల ఉద్యోగాలు మాత్రమే నింపారని, 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పోగొట్టారని అన్నారు. ప్రభుత్వ విధానం వల్ల లక్షా 65 వేలకుపైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల భవిష్యత్తు గాల్లో ఉందన్నారు. 90 వేలకు పైగా ఉన్న తెలుగు టీచర్లను ఆంగ్ల మాధ్యమం పేరుతో భయపెడుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నారని ట్వీట్ చేశారు. ఇక ఆంధ్రాకి పెట్టుబడులు రావు, దీంతో ఉద్యోగ అవకాశాలుండవు అని నిరుద్యోగులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని పవన్‌ అన్నారు.

పెట్టుబడి పెట్టినా.. అమరావతి రాజధాని ఉంటుందా? కేంద్రం ఏపీకి నిధులు ఇస్తుందా? నవరత్నాలకు నిధులు ఉన్నాయా అంటూ? ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల నెల నెలా జీతభత్యాలకు డబ్బులున్నాయా? అని అడిగారు. 40 వేల కోట్లపై అప్పు, పెట్టుబడులు లేవు, పెట్టినవి పంపేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆంగ్ల భాష బోధన వాదంతో తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, భారతీయ సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నతికి శ్రీకారం చుట్టారని ఘాటుగా వ్యాఖ్యానించారు పవన్‌ కళ్యాణ్‌. 151 అసెంబ్లీ సీట్లు ఉన్న వైసీపీ హానికరం ఇకనైనా ఆపాలని కోరుకుందామని ట్వీట్ చేశారు పవన్‌.

Tags

Read MoreRead Less
Next Story